సొంతింటి ఆశలు తీరే సమయం!  | State Government Guidelines for Distribution of Double Bedroom Houses in Greater Hyderabad | Sakshi
Sakshi News home page

సొంతింటి ఆశలు తీరే సమయం! 

Published Sun, Apr 30 2023 3:27 AM | Last Updated on Sun, Apr 30 2023 3:27 AM

State Government Guidelines for Distribution of Double Bedroom Houses in Greater Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఎన్నోఏళ్లుగా డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు త్వరలో తీరనున్నాయి. మంత్రి కేటీఆర్‌ కొత్త సచివాలయం ప్రారంబోత్సవం రోజున డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాల ఫైల్‌పైనే తొలి సంతకం చేయనున్నారు. దీనితో ల ర్థిదారుల ఎంపిక చేపట్టి, ఇళ్లను పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. నాలుగైదు నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో.. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. 

కొనసాగుతున్న వివరాల అప్‌లోడింగ్‌ 
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లలో దాదాపు 63వేల వరకు పూర్తయ్యాయి. ల ర్థిదారులను ఎంపిక చేయగానే వాటిని పంపిణీ చేయవచ్చు. మిగతా ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం ఏడు లక్షలమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.

వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించి ఓటరు కార్డు ఆధారంగా వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 3.6 లక్షల మంది వివరాలు అప్‌లోడ్‌ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. కానీ పంపిణీ చేయకపోవడంతో.. పలుచోట్ల ఇళ్లలోని సామగ్రి దొంగల పాలైంది. 

మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఎక్కువ ఇళ్లు 
జీహెచ్‌ఎంసీలో నిర్మాణం చేపట్టిన డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లలో ఎక్కువశాతం మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆ జిల్లాలో 38,419 ఇళ్లు ఉండగా.. హైదరాబాద్‌ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇళ్లున్నాయి. వీటిలో పాత ఇళ్లు, గుడిసెలను కూల్చి అక్కడే కొత్తగా నిర్మించిన వాటిని మాత్రం ఇప్పటికే పంపిణీ చేశారు. నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సరిపడా స్థలాలు లేనందున శివారు ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మించారు. నగరంలో ఉంటున్న వారికి కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. 

మూడు కేటగిరీలుగా ‘డబుల్‌’ఇళ్లు 
అవసరాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో అందుబాటును బట్టి జీహెచ్‌ఎంసీలో మూడు కేటగిరీల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించారు.  
సెల్లార్‌+స్టిల్ట్‌+9 అంతస్తులు, లిఫ్టులు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.65 లక్షలు. 
స్టిల్ట్‌+ 5 అంతస్తులు, లిఫ్టులు, మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.50 లక్షలు. 
లిఫ్టులు లేకుండా గ్రౌండ్‌+3 అంతస్తులు. మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.7.75 లక్షలు. 

పేదలకు ఇళ్ల పంపిణీపై కేటీఆర్‌ తొలి సంతకం 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనంలోని మూడో అంతస్తులో తనకు కేటాయించిన చాంబర్‌లోకి ఆదివారం మంత్రి కేటీఆర్‌ అడుగుపెట్టబోతున్నారు. ఈ కార్యాలయం నుంచే ఐటీ, మున్సిపల్, పట్ట ణాభివృద్ధి, పరిశ్రమల శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించనున్నారు.

కొత్త సచివాలయం నుంచి విధుల నిర్వహణ సందర్భంగా కీలకమైన డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పంపిణీకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేయనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కేటాయింపు మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్‌ ఇది అని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement