కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: బీజేపీ ‘చలో బాటసింగారం’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, ఇతర నేతలను అరెస్టు చేసి వారు బాటసింగారం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఇతర నాయకులను వారి వారి నివాసాల్లోనే నిర్బంధంలో ఉంచారు.
కాన్వాయ్‌కి డీసీఎం అడ్డుగా పెట్టి..
హైదరాబాద్ శివార్లలోని బాటసింగారంలో మధ్య లో నిలిపేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం పరిశీలించాలని కిషన్‌రెడ్డి నిర్ణయించారు. అక్కడే పేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని భావించారు. దీంతో బుధవారం రాత్రి నుంచే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వివిధ స్థాయిల పార్టీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే వారిని, ఆఫీసు బాధ్యులను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులను కట్టడి చేశారు. ఈ
నేపథ్యంలో ఉదయాన్నే ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన కిషన్‌రెడ్డి నేరుగా బాటసింగారం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. బీఆర్‌ఎస్ నేతలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా రఘునందన్‌రావు ప్రశ్నించారు. అంతా కలిసి ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా బాట సింగారం వైపు బయలుదేరారు. అయితే పోలీసులు ఓర్‌ఆర్‌ఆర్ వద్దే కాన్వాయ్‌కి ఎదురుగా డీసీఎంను నిలిపి అడ్డుకున్నారు.
నా చర్మం ఊడిపోతోంది..
మీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా
పోలీసుల వైఖరికి నిరసనగా కిషన్‌రెడ్డి, ఇతర నేతలు రోడ్డుపై వర్షంలో తడుస్తూనే బైఠాయించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, పోలీసులకు సహకరించాలని పోలీసు కమిషనర్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో తనను రోడ్డు పైనుంచి లేపేందుకు ప్రయతి్నంచిన పోలీసులతో కేంద్రమంత్రి వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ చర్యలతో నా చర్మమంతా ఎరుపుగా మారి కమిలిపోయి ఊడి పోతోంది. మిమ్మల్ని లోక్‌సభ స్పీకర్ ముందు నిలబెడతా.. మీపై ఫిర్యాదు చేస్తా.. మీరు సీఎం కేసీఆర్ కుటుంబానికి కట్టుబానిసల్లా పనిచేస్తున్నారు. నన్ను చంపుతారా?..చంపండి..ఇంటికి మాత్రం వెళ్లను..’ అంటూ కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కేంద్రమంత్రిని బలవంతంగా ఆయన వాహనంలో కూర్చోబెట్టి పోలీసులే నడుపుతూ ఆరాంఘర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, మాసబ్ ట్యాంక్, ఎర్రమంజిల్, ఖైరతాబాద్ మీదుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. కాగా కిషన్‌రెడ్డి, ఇతర నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయం సమీపంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టి»ొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచి్చంది. పార్టీ పరంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం: ఈటల
బీజేపీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్‌మెట్, బాటసింగారం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు వైపు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఎంపీ అరవింద్‌ను బంజారాహిల్స్‌లోని నివాసంలో, డీకే అరుణను జూబ్లీహిల్స్‌లోని నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. ఈటలను శామీర్‌పేటలోని ఇంటి వద్దే అడ్డుకోగా, ఆయన కార్యకర్తలతో కలిసి అక్కడే ధర్నాకు కూర్చొన్నారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేంద్రమంత్రి హక్కులను భంగం కలిగించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి అప్పులు తీసుకుని, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన డబుల్ ఇళ్లను పేదలకు ఇంకా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం అని అన్నారు. తార్నాకలో రాంచందర్‌రావు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment