సొంతంగా సర్వేలు.. గెలుపు వ్యూహాలు | mlas online survey on their own winning tactics in telangana | Sakshi
Sakshi News home page

‘సర్వే’జన నాయకా..!

Published Fri, Feb 9 2018 1:38 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

mlas online survey on their own winning tactics in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా పార్టీ సర్వేలో వెనుకబడి ఉన్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అసలెందుకిలా జరుగుతోంది? నిజంగానే జనాల్లో నాపై వ్యతిరేకత ఉందా? లేదా కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నానా? అన్న సందేహాలు వచ్చాయి. వీటిపై హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీతో సర్వే చేయించుకోవాలనుకున్నారు. అంతేకాదు.. అదే సంస్థతో తన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నెలరోజుల్లో కార్యాచరణ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వెంట ఇద్దరు ఏజెన్సీ ప్రతినిధులు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. 

ఆయన చేసే పనులను ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్టు చేస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో ఇటీవల పార్టీ ఆ జిల్లాలో చేసిన సర్వేలో సదరు ఎమ్మెల్యే టాప్‌–3 స్థానంలోకి వచ్చారు. ఇలా ఒక్క కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే కాదు.. రాష్ట్రంలో మరో 35 మంది ఎమ్మెల్యేలు ఇదే దారిలో నడుస్తున్నారు. తమకంటూ సొంత ఎనాలిసిస్‌ బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేలే కాదు వారిపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన ఇతర పార్టీ అభ్యర్థులు సైతం పలు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇంకేముంది.. పోటాపోటీగా కార్యక్రమాలు, ధర్నాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నారు! యువత ఓట్లను పొందడంతోపాటు నియోజకవర్గాల్లో జనాలను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. 

3 వేల మందితో మాట్లాడి.. 
ప్రతీ నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు మండలాలు, 120 నుంచి 150 గ్రామాలుంటాయి. ఎమ్మెల్యే నియమించుకుంటున్న ఏజెన్సీ ముందుగా.. నాయకుడి పనితీరు, పార్టీపై అభిప్రాయం, ప్రభుత్వ పథకాలు ఇలా పలు అంశాలపై సర్వే పత్రాలను రూపొందిస్తుంది. తర్వాత ఆ ఏజెన్సీకి చెందిన 10 మంది ఉద్యోగులు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో 20 నుంచి 25 మందిని కలిసి.. ఎమ్మెల్యే, పార్టీ పనితీరు, ప్రభుత్వ పథకాలు, వాటి అమలుపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇలా ఐదు మండలాల్లో సుమారు 3 వేల మందిని సర్వే చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ బలం, ప్రభుత్వ పథకాల లబ్ధితో గెలిచే అవకాశాలు, ప్రతికూల అంశాలపై విశ్లేషణ చేస్తున్నారు. తర్వాత ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేయాలో సూచిస్తూ కార్యచరణ ప్రణాళిక అందిస్తున్నారు. 

నెలకు రూ.4 లక్షలతో డీల్‌ 
2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఒకరు ఓ ఏజెన్సీతో సర్వే చేయించుకుంటున్నారు. గతంలో హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వే సంస్థ ద్వారా తాను గతంలో ఓటమి పాలవడానికి కారణాలు.. పార్టీ, తనపై జనాభిప్రాయం తదితర అంశాలపై అధ్యయనం చేయించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు, వాటి ప్రచారం బాధ్యత మొత్తం ఏజెన్సీకి అప్పగించారు. ఇందుకు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలతో ఏజెన్సీతో డీల్‌ కుదుర్చుకున్నట్టు కాంగ్రెస్‌ వర్గాల ద్వారా తెలిసింది. 
 
ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే.. 
– తమ సేవలపై ప్రత్యేకంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి మరీ ఎమ్మెల్యేలు, పోటీ చేయబోయే అభ్యర్థులతో ఏజెన్సీలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి 
– ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో అభ్యర్థుల పేరిట ఖాతాలు తెరవడం 
– ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా వెబ్‌సైట్‌ ఏర్పాటు, వాట్సాప్‌ ద్వారా ప్రమోషన్‌ 
– నాయకుడు చేసిన ప్రతీ కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువ మంది కార్యకర్తలు, ఓటర్లకు చేరవేయడం 
– ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎలా ఉండాలి? ఇంకా ఏం చేయాలన్న దానిపై కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్‌ 
– ప్రత్యేక ఆల్బమ్‌ రూపొందించడం, అభ్యర్థులపై పాటలు రూపొందించడం, వెబ్‌ లైవ్‌చాట్, డైలీ యాక్టివిటీస్‌ అప్‌డేట్, ప్రొగ్రామ్‌ షెడ్యుల్‌ డిజైన్‌ చేయడం 
– బల్క్‌ సందేశాలు పంపించడం, చేసిన కార్యక్రమాల వీడియోల లింకులను వీటి ద్వారా పంపించడం 
– ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌లో భాగంగా కరపత్రాలు డిజైన్‌ చేయడం, వాటిని పంపిణీ చేయించడం, నెలవారీ సర్వేల తయారీ, అభ్యర్థి గెలుపుకు తీసుకోవాల్సిన కార్యచరణను వ్యూహాత్మకంగా అమలు చేయడం 
– మహిళా, పురుష ఓటర్లను గుర్తించడం, వారి మొబైల్‌ నంబర్లు సేకరించి డాటా నిర్వహించడం 
– అభ్యర్థిపై సానుకూల దృక్పథం జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం, ఆకట్టుకునేలా ప్రసంగాలు తయారు చేయడం 

ఖర్చు భారీగానే.. 
తమ గెలుపు కోసం అభ్యర్థులు ఏజెన్సీలకు భారీగానే ముట్టజెప్పుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన ఏజెన్సీలు 35 మంది ఎమ్మెల్యేలు, మరో 30 మంది పోటీ అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకు అవి ప్రతీ నెల రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు వసూలు చేస్తున్నాయి. ప్రతీ ఏజెన్సీ సర్వే సమయంలో 15 మందిని కేటాయిస్తోంది. అలాగే సోషల్‌ మీడియా అప్‌డేట్‌ కోసం మరో నలుగురిని నియమిస్తోంది. ప్రతిరోజూ ఎమ్మెల్యే వెంట మరో ఇద్దరు ఉంటున్నట్టు తెలిసింది. 

టెక్నాలజీ యుగంలో కీలకం: 
ప్రస్తుతం టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ మందికి కార్యక్రమాలు తెలిసేలా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అందుకు దేశవ్యాప్తంగా అనేక సర్వే సంస్థలు, ఏజెన్సీలు అభ్యర్థుల కోసం పని చేస్తున్నాయి. ప్రస్తుతం మేం 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇతర పార్టీ అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మా కార్యచరణ నచ్చితేనే వారు ఒప్పందం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేమెంట్‌కు ఒప్పుకుంటున్నారు. మా టీంలో ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 10 మందిని నియమించాం. మరో నెలరోజుల్లో పూర్తిస్థాయిలో కార్యచరణ అమలు చేస్తాం.  
- డాక్టర్‌ జుబేర్, ఎండీ, మై మీడియా సొల్యూషన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement