సీఎం విధేయులకు టిక్కెట్ ఖరారు?
సీఎం విధేయులకు టిక్కెట్ ఖరారు?
Published Sat, Dec 24 2016 11:36 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
లక్నో: రాబోయే అసెంబ్లీ నేపథ్యంలో సీట్ల పంపకంపై ఎస్పీ సుప్రీం ములాయం ఇంట రేకెత్తిన మరో రాజకీయ సంక్షోభంపై ఏ నిమిషాన తమకు ఏం జరుగుతుందోనని ఎమ్మెల్యేలందరూ తెగ ఆందోళన చెందుతున్నారు. దీంతో సీట్ల పంపిణీ విషయంలో ఆందోళన చెందకండి మీకు నేనున్నా అంటూ అఖిలేష్ వారికి భరోసా ఇచ్చాడట. శుక్రవారం సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యేలతో అఖిలేష్ జరిపిన భేటీలో ఈ హామీని ఇచ్చినట్టు తెలుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు సమాంతర టిక్కెట్ల పంపిణీకి సన్నద్ధమవుతున్నానని చెప్పారట. నియోజకవర్గాలు వెళ్లి ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అఖిలేష్ను కలిసిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఆయనకు విధేయులుగా ఉంటున్న యంగ్ ఎమ్మెల్యేలే. 'టిక్కెట్ల గురించి మీరేమి భయపడాల్సినవసరం లేదు. ప్రచారానికి నేను మీ నియోజకవర్గాలకు వస్తాను. కానీ ఎవరూ కూడా ఆత్మ అసంతృప్తితో ఉండకండి' అని సూచించారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
అఖిలేష్ తమ ముందుండి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నప్పటి నుంచి ఆర్మీ టీమ్ను ఎన్నుకునే విషయంలో అఖిలేష్కు పూర్తిహక్కులున్నాయని సీఎం సన్నిహిత ఓ ఎమ్మెల్యే చెప్పారు. ఎస్పీ రాష్ట్ర చీఫ్, అఖిలేష్ బాబాయి శివ్పాల్ యాదవ్కు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే బాబాయికి, అబ్బాయికి గత కొంతకాలంగా అసలు పొంతన కుదరకపోవడంతో ఎస్పీ ఇంట రాజకీయ సంక్షోభం రేకెత్తింది. అటూ ఇటూ చేసి వారి గొడవను నేతాజి ములాయం కొంత సద్దుమణిగేలా చేసినా.. మళ్లీ సీట్ల పంపకంపై అఖిలేష్కు, శివ్పాల్కు పోరు ప్రారంభమైంది. అఖిలేష్‌కు ఇష్టంలేని వ్యక్తులకు శివ్పాల్ సీట్ల పంపిణీ చేపడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అఖిలేష్ కూడా కారాలు మిరియాలు నూరుతున్నారట.
Advertisement
Advertisement