అబ్బాయికి చుక్కలు చూపిస్తున్న బాబాయి!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ తాజాగా తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గతంలో టికెట్ ఖరారైన 17మందికి షాకిచ్చి.. వారి స్థానంలో కొత్తవారి పేర్లను వెల్లడించింది. ఈ నిర్ణయాలతో సమాజ్‌వాదీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్ ఆధిపత్యానికి తెరలేసినట్టు అయింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాల్లో తనదైన ముద్ర ఉండేలా.. అన్నింటా తన పట్టు నిలుపుకొనేలా శివ్‌పాల్ యాదవ్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి బాబాయి శివ్‌పాల్-అబ్బాయి అఖిలేశ్ మధ్య విభేదాలు సద్దుమణిగి.. అంతా సర్దుకున్నట్టు పైకి కనిపిస్తున్నా.. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మున్ముందు మరింత తీవ్రతరం అయ్యే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో మార్పులు చూసి విస్తుపోయిన అఖిలేశ్.. పైకి మాత్రం మార్పుల గురించి తనకు తెలియదని చెప్పారు. టిక్లెట్ల పంపిణీలో మీ పాత్ర ఏమిటి అని అడిగితే.. 'అన్ని హక్కులు వదిలేసుకున్నా... కొందరు వ్యక్తులకు వాటిని అప్పగించా' అంటూ కొంత నిర్వేదంగా బదులిచ్చారు. పార్టీ వ్యవహారాలపై నేరుగా సమాధానం ఇవ్వకుండా.. 'కొందరు వ్యక్తుల చేతుల్లో అధికారం' ఉందంటూ అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన అసంతృప్తిని చాటుతున్నాయి.
ఎస్పీ అధినేత ములాయం తనయుడు అఖిలేశ్, తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ మధ్య ఇటీవల తలెత్తిన అంతర్గత పోరు సద్దుమణిగిన సంగతి తెలిసిందే. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అఖిలేశ్‌ను తొలగించి.. ఆ స్థానంలో శివ్‌పాల్‌ను ములాయం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోయిన అఖిలేశ్ తన కేబినెట్‌లో మంత్రి అయిన శివ్‌పాల్ యాదవ్ శాఖలకు కోత పెట్టారు. దీంతో శివ్‌పాల్ యాదవ్ రాజీనామా చేయడం.. ములాయం జోక్యం చేసుకొని ఆయన శాఖలు తిరిగి ఆయనకు కేటాయించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా సోదరుడికి అండగా నిలువడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
ఈ నేపథ్యంలో అఖిలేశ్ సన్నిహితులను అభ్యర్థుల జాబితా నుంచి తొలగించి శివ్‌పాల్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. మాజీ మంత్రి అమర్‌మణి త్రిపాఠీ కొడుకు, నేరచరిత్ర ఉన్న అమన్‌మణికి మహారాజ్ గంజ్ జిల్లా నౌతన్వా స్థానం టికెట్ ఇవ్వడం, అఖిలేశ్‌కు సన్నిహితుడైన యువ నాయకుడు అతుల్ ప్రధాన్‌కు ఇచ్చిన టికెట్ వేరొకరికి ప్రకటించడం సీఎంకు ఎదురుదెబ్బలని భావిస్తున్నారు. అఖిలేశ్ ప్రభుత్వమే భార్య మృతికేసులో అమన్‌మణిపై సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేసింది. అయితే, తనకు సన్నిహితుడైన అమర్‌మణి కొడుకు అమన్‌మణికి టికెట్ ఇచ్చితీరాలని శివ్‌పాల్ యాదవ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
పార్టీ టికెట్ల కేటాయింపు అంశంతో ఎస్పీపై అఖిలేశ్ పట్టు జారిపోతుండగా.. అదే సమయంలో శివ్‌పాల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 229 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండటంతో ఈ విషయంలో అబ్బాయి-బాబాయి ఎలాంటి విభేదాలు భగ్గుమంటాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.