ticket distribution
-
సీట్ల పంపకాల్లో ‘మహా’ ప్రతిష్టంభన!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావికాస్ అఘాడీలో టికెట్ల పంపిణీపై విభేదాలు మొదలయ్యాయి. 288 స్థానాల్లో 260 స్థానాలపై మధ్య ఏకాభిప్రాయం కుదరగా, 28 సీట్లపై పీటముడి పడినట్లు సమాచారం. అఘాడీ భాగస్వాములు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎప్పి) శుక్రవారం 9 గంటల పాటు జరిగిన మారథాన్ సమావేశం జరిపాయి. . విదర్భలో ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్‌ను ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.ఆ సీట్లనే కోరుతున్న శివసేనవిదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఉమ్మడి శివసేన, బీజేపీ కూటమి 27 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 15, శివసేన 12 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒంటరిగా 29, ఎన్సీపీ ఐదు సీట్లు గెలిచాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత కూడా విదర్భ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వెంటే ఉన్నారు. శివసేనలో తిరుగుబాటు తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ఏకనాథ్ షిండే వైపు, 8 మంది ఉద్ధవ్ వైపు నిలిచారు. ఇప్పుడు పాత ఫలితాలపైనే సమస్య నెలకొంది. సీట్ల పంపిణీ ఫార్ములా ప్రకారం 2019లో గెలిచిన 12 సీట్లు తమకే దక్కాలని ఉద్ధవ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని సమాచారం. ముంబైలోని 20–25 స్థానాల్లో స్థానాల పంపకాలు కూడా సమస్యగా మారింది. ముంబై శివసేన కంచుకోట గనుక అక్కడ ఎక్కువ సీట్లు రావాలని ఉద్ధవ్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలను బీజేపీ–సేన కూటమి కైవసం చేసుకుంది. శివసేన 22, బీజేపీ 9 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది. -
సీఎం విధేయులకు టిక్కెట్ ఖరారు?
లక్నో: రాబోయే అసెంబ్లీ నేపథ్యంలో సీట్ల పంపకంపై ఎస్పీ సుప్రీం ములాయం ఇంట రేకెత్తిన మరో రాజకీయ సంక్షోభంపై ఏ నిమిషాన తమకు ఏం జరుగుతుందోనని ఎమ్మెల్యేలందరూ తెగ ఆందోళన చెందుతున్నారు. దీంతో సీట్ల పంపిణీ విషయంలో ఆందోళన చెందకండి మీకు నేనున్నా అంటూ అఖిలేష్ వారికి భరోసా ఇచ్చాడట. శుక్రవారం సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యేలతో అఖిలేష్ జరిపిన భేటీలో ఈ హామీని ఇచ్చినట్టు తెలుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు సమాంతర టిక్కెట్ల పంపిణీకి సన్నద్ధమవుతున్నానని చెప్పారట. నియోజకవర్గాలు వెళ్లి ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అఖిలేష్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఆయనకు విధేయులుగా ఉంటున్న యంగ్ ఎమ్మెల్యేలే. 'టిక్కెట్ల గురించి మీరేమి భయపడాల్సినవసరం లేదు. ప్రచారానికి నేను మీ నియోజకవర్గాలకు వస్తాను. కానీ ఎవరూ కూడా ఆత్మ అసంతృప్తితో ఉండకండి' అని సూచించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అఖిలేష్ తమ ముందుండి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నప్పటి నుంచి ఆర్మీ టీమ్‌ను ఎన్నుకునే విషయంలో అఖిలేష్‌కు పూర్తిహక్కులున్నాయని సీఎం సన్నిహిత ఓ ఎమ్మెల్యే చెప్పారు. ఎస్పీ రాష్ట్ర చీఫ్, అఖిలేష్ బాబాయి శివ్‌పాల్ యాదవ్‌కు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే బాబాయికి, అబ్బాయికి గత కొంతకాలంగా అసలు పొంతన కుదరకపోవడంతో ఎస్పీ ఇంట రాజకీయ సంక్షోభం రేకెత్తింది. అటూ ఇటూ చేసి వారి గొడవను నేతాజి ములాయం కొంత సద్దుమణిగేలా చేసినా.. మళ్లీ సీట్ల పంపకంపై అఖిలేష్‌కు, శివ్‌పాల్‌కు పోరు ప్రారంభమైంది. అఖిలేష్‌కు ఇష్టంలేని వ్యక్తులకు శివ్‌పాల్ సీట్ల పంపిణీ చేపడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అఖిలేష్ కూడా కారాలు మిరియాలు నూరుతున్నారట. -
అబ్బాయికి చుక్కలు చూపిస్తున్న బాబాయి!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ తాజాగా తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గతంలో టికెట్ ఖరారైన 17మందికి షాకిచ్చి.. వారి స్థానంలో కొత్తవారి పేర్లను వెల్లడించింది. ఈ నిర్ణయాలతో సమాజ్‌వాదీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్ ఆధిపత్యానికి తెరలేసినట్టు అయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాల్లో తనదైన ముద్ర ఉండేలా.. అన్నింటా తన పట్టు నిలుపుకొనేలా శివ్‌పాల్ యాదవ్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి బాబాయి శివ్‌పాల్-అబ్బాయి అఖిలేశ్ మధ్య విభేదాలు సద్దుమణిగి.. అంతా సర్దుకున్నట్టు పైకి కనిపిస్తున్నా.. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మున్ముందు మరింత తీవ్రతరం అయ్యే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో మార్పులు చూసి విస్తుపోయిన అఖిలేశ్.. పైకి మాత్రం మార్పుల గురించి తనకు తెలియదని చెప్పారు. టిక్లెట్ల పంపిణీలో మీ పాత్ర ఏమిటి అని అడిగితే.. 'అన్ని హక్కులు వదిలేసుకున్నా... కొందరు వ్యక్తులకు వాటిని అప్పగించా' అంటూ కొంత నిర్వేదంగా బదులిచ్చారు. పార్టీ వ్యవహారాలపై నేరుగా సమాధానం ఇవ్వకుండా.. 'కొందరు వ్యక్తుల చేతుల్లో అధికారం' ఉందంటూ అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన అసంతృప్తిని చాటుతున్నాయి. ఎస్పీ అధినేత ములాయం తనయుడు అఖిలేశ్, తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ మధ్య ఇటీవల తలెత్తిన అంతర్గత పోరు సద్దుమణిగిన సంగతి తెలిసిందే. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అఖిలేశ్‌ను తొలగించి.. ఆ స్థానంలో శివ్‌పాల్‌ను ములాయం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోయిన అఖిలేశ్ తన కేబినెట్లో మంత్రి అయిన శివ్‌పాల్ యాదవ్ శాఖలకు కోత పెట్టారు. దీంతో శివ్‌పాల్ యాదవ్ రాజీనామా చేయడం.. ములాయం జోక్యం చేసుకొని ఆయన శాఖలు తిరిగి ఆయనకు కేటాయించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా సోదరుడికి అండగా నిలువడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ సన్నిహితులను అభ్యర్థుల జాబితా నుంచి తొలగించి శివ్‌పాల్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. మాజీ మంత్రి అమర్మణి త్రిపాఠీ కొడుకు, నేరచరిత్ర ఉన్న అమన్మణికి మహారాజ్ గంజ్ జిల్లా నౌతన్వా స్థానం టికెట్ ఇవ్వడం, అఖిలేశ్‌కు సన్నిహితుడైన యువ నాయకుడు అతుల్ ప్రధాన్‌కు ఇచ్చిన టికెట్ వేరొకరికి ప్రకటించడం సీఎంకు ఎదురుదెబ్బలని భావిస్తున్నారు. అఖిలేశ్ ప్రభుత్వమే భార్య మృతికేసులో అమన్మణిపై సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేసింది. అయితే, తనకు సన్నిహితుడైన అమర్మణి కొడుకు అమన్మణికి టికెట్ ఇచ్చితీరాలని శివ్‌పాల్ యాదవ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ టికెట్ల కేటాయింపు అంశంతో ఎస్పీపై అఖిలేశ్ పట్టు జారిపోతుండగా.. అదే సమయంలో శివ్‌పాల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 229 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండటంతో ఈ విషయంలో అబ్బాయి-బాబాయి ఎలాంటి విభేదాలు భగ్గుమంటాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.