రాజయ్య, ముత్తిరెడ్డి, శంకర్‌నాయక్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వచ్చే సార్వత్రిక ఎన్నికల టికెట్ల వేట లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు.. మరోసారి కూడా సీట్లు దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కచ్చితంగా టికెట్లు ఇస్తామని, సెప్టెంబర్‌లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఊగిసలాటలో ఉన్న జనగామ, మహబూబాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, తాటికొండ రాజయ్య కు టికెట్లు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కేసీఆర్‌కు సన్నిహితులుగా పేరున్న భూపాలపల్లి ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ములుగు ఎమ్మెల్యే, గిరిజన పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ భవిష్యత్ నిర్ణయాన్ని వారికే వదిలేసినట్లు సమాచారం.
సిట్టింగ్‌లను పక్కనపెట్టి కొత్త వారికి టికెట్లు ఇస్తే... ఓటర్లకు తప్పుడు సంకేతాలు పో యే ప్రమాదం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సొంత బలం ఉంటుందని, ఆ బలానికి పార్టీ క్యాడర్ కలిస్తేనే సునాయాస విజయం దక్కుతుందని కేసీఆర్ యో చిస్తున్నారు. సిట్టింగ్‌లను కాదని కొత్తవారికి అవకాశం ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల బలాన్ని వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమా దం ఉందనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు.
స్వయంకృతాపరాధమే..
నియోజవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు, వారికి ఉన్న ప్రజాదరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వివిధ సంస్థల ద్వారా ఆరు సార్లు› సర్వే చేయి ంచారు. ఇవి కాకుండా పోలీస్ ఇంటెలిజెన్స్‌తో ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రవర్తన, ప్రజలతో మమే కం అవుతున్న తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తొలి సర్వేలో కొంత వెనుకబడిన జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తర్వాత సర్వేలో పుంజుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు తేలింది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నోటి దురుసుతనంతోనే వెనుకబడుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికా రులు నివేదించారు. ముఖ్యంగా శంకర్‌నాయక్ గత హరితహారం సమయంలో మహిళా కలెక్టర్ చెయ్యి పట్టుకోవడం వివాదాస్పదమైంది.
ఈ సంఘటన సాధారణ ప్రజలు, మహిళలను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే సీఎం కల్పించుకుని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పంపించి శంకర్‌నాయక్‌తో కలెక్టర్‌కు క్షమాపణ చెప్పించడంతో ప్రజాగ్రహం కొంత మేరకు చల్లబడింది. ఆ వెంటనే మళ్లీ ఆయనపై కేసు నమోదు చేశారు. గిరిజన నాయకుడు కాబట్టే ఇందంతా చేస్తున్నారంటూ ప్రజలు కొంత మేరకు ఆయనపై సానుభూతి వ్యక్తం చేశారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఆయనకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానా యక్ కూతురు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత, ఎక్సైజ్ మాజీ అధికారి మోహన్‌లాల్ ప్రధాన పోటీగా ఉన్నారు. వారినుద్దేశించి శంకర్‌నాయక్ అక్కడక్కడ ఇషమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారనే సమాచారం ముఖ్యమంత్రి వద్ద ఉంది.
నోరు అదుపులో పెట్టుకుంటే ఢోకా లేదు !
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిది ఇదే తరహా వ్యవహారం. ఆయనకు నియోకవర్గంతో చెప్పుకోదగిన పోటీదారుడు లేడు. కానీ, ఆయన స్వయం కృతాపరాధంతోనే టికెట్‌కు ఎసరు తెచ్చుకున్నాడనే ప్రచారం ఉంది. మొదటి నుంచి భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా రు. బతుకమ్మ కుంట ఆక్రమణ విషయంపై కలెక్టర్‌తో ఘర్షణ పడడంతో టీఆర్‌ఎస్ పార్టీకి ఇబ్బ ందిగా మారింది. అంతకంటే ముందు కొమురవెల్లి మల్లన్న విగ్రహం మార్పు, వార్తలు రాశారనే కక్షతో ఓ జర్నలిస్టు ప్లాట్‌లో అడ్డంగా రోడ్డు వేసుకుంటూ వెళ్లడం తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇటీవల ఓ భూమి గొడవ విషయంలో మహిళా వీఆర్వో ఇంటికి రాత్రి వేళ వెళ్లి తమకు అనుకూలంగా రికార్డులు చేయాలని అడగడం కూడా వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఇద్దరు నియోజకవర్గంలో బలమైన నాయకులే. కానీ, నోటి దురుసుతనం ముంచుతోందని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే వారికి ఢోకా లేదని ఇంటెలిజెన్స్ అధికారులు నివేదించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
రాజయ్యపై అంతుపట్టని సీఎం అంతరంగం
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భవిష్యత్‌పై ముఖ్యమంత్రి అంతరంగం ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. భూపాలపల్లి ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ మధుసుదనాచారిని పెద్దల సభకు పంపిస్తారనే ప్రచారం ఉంది. అయితే తుది నిర్ణయం ఆయన మీదనే ఆధారపడి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకే ఆయన మొగ్గు చూపుతున్నారు. కొండా దంపతుల కూతురు సుష్మితపటేల్, గండ్ర సత్యనారాయణరావు ఇక్కడి నుంచి ప్రధానంగా టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుసుదనాచారి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విమర్శల నేపథ్యంలో నియోజకవర్గానికి తన కొడుకులను కొంతదూరం పెట్టి, అభివృద్ధి పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. వేలాది మంది తన నియోజకవర్గ ప్రజలను అసెంబ్లీ సమావేశాలను చూపించడం ఆయనకు కొంత కలిసి వచ్చింది.
ములుగుపై సీతారాం కన్ను ?
ములుగు ఎమ్మెల్యే, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కొడుకు అజ్మీరా ప్రహ్లాద్‌కు టికెట్ అడిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీటుపై మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిస్తే ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో చందూలాల్ సలహాలు, సూచనలను స్వీకరించి..కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment