♦ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో సీఎం కేసీఆర్
♦ అవినీతి రహిత ప్రభుత్వంగా గుర్తింపు వచ్చింది
♦ నిబద్ధతతో ఉండండి.. వచ్చిన పేరు చెడగొట్టొద్దని సూచన
సాక్షి, హైదరాబాద్: ‘‘కేవలం 20 నెలల పాలనతోనే రాష్ట్ర ప్రభుత్వం అవినీతిరహిత ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం కూడా ప్రధానికి నివేదిక అందించింది. ఇదే నిబద్ధతతో పనిచేయండి. అవినీతికి దూరంగా ఉండండి. వచ్చిన మంచి పేరును చెడగొట్టొద్దు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు హితబోధ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో 63 సీట్లు గెలిచాం. ఇప్పుడు 85 దాకా ఆ సంఖ్య పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 100 స్థానాలు గెలవాలి. ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే 125 స్థానాలు మనవే కావాలి..’’ అని సీఎం అన్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం కల్లా శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకం పూర్తి చేస్తామని, ఈ సమావేశాలు ముగిసేలోపే అసెంబ్లీలో ఖాళీగా ఉన్న ఇతర కమిటీలనూ నియమిస్తామని తెలిపారు.
అయోమయంలో ప్రతిపక్షాలు
‘‘రాష్ట్రంలో ప్రతిపక్షాలు పూర్తిగా అయోమయంలో ఉన్నాయి. మనం ప్రజల మనసులు గెల్చుకున్నాం. అన్ని ఎన్నికల్లో ప్రజలు మనన్నే దీవించారు. ఒక్క దేవీప్రసాద్ విషయంలోనే ఫెయిలయ్యాం. ఉద్యోగ సంఘాల నేత కదా అని ఆయనకే వదిలేశాం..’’ అని సీఎం పేర్కొన్నారని తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయంపై సీఎం ఒకిం త సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. ‘‘ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో వేలు పెట్టొద్దు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట మాత్రమే మంత్రులు ఆ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవాలి. వీలైతే ప్రతీ మంత్రి తమ జిల్లాల్లోని పార్టీల ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లండి, కలిసి మెలిసి ఉండండి. పార్టీ కమిటీల నియామకాల్లోనూ ఎమ్మెల్యేల సిఫారసులకే ప్రాధాన్యం ఇవ్వండి. ఒకే మండలం ఇద్దరు ఎమ్మెల్యే పరిధిలో ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ప్రతిపాదనలు తీసుకోండి’’ అని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించుకుంటూ పనిచేస్తే ఎమ్మెల్యేలకు మంచిపేరు వస్తుందన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లలో జోక్యం వద్దు
‘‘డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. గ్రామాల ఎంపిక వరకు మీ బాధ్యత. లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లకే వదిలేయండి’’ అని సీఎం పార్టీ నేతలకు సూచించారు. ఎమ్మెల్యేల జీత భత్యాల పెంపు అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేల ఇళ్ల స్థలాల విషయంలో కోర్టు కేసులు ఉన్నందున, వాటిపై అధ్యయనం చేసే బాధ్యతను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి అప్పజెప్పినట్లు తెలిసింది. జిల్లాల్లో నిర్మించతలపెట్టిన పార్టీ ఆఫీసుల విషయంలో జిల్లాల మంత్రులకే బాధ్యతలు అప్పజెప్పారు. ‘‘ప్రతీ జిల్లాలో కనీసం ఎకరం విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాల నిర్మాణం జరగాలి. దీనికి సంబంధించిన స్థల సేకరణ, నిర్మాణ బాధ్యతలు మంత్రులే చూడాలి..’’ అని సీఎం ఆదేశించారని సమాచారం. ఇప్పటిదాకా పార్టీ ప్లీనరీ ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో జరగలేదని, ఈసారి ఖమ్మం వంతు వచ్చిందన్నారు. ప్రతినిధుల సభకు మండలాధ్యక్షుడు ఆపై స్థాయి నాయకులను 3 వేల మందిని ఆహ్వానించాలని, 2 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం.