ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి?
- పన్నీర్ సెల్వం వర్గం తర్జనభర్జన
- ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రాకపోవడంపై మంతనాలు
- శాసనసభ్యులను ఆకర్షించేందుకు కొత్త వ్యూహాలు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శశికళ శిబిరం నుంచి 11 మంది ఎంపీలతోపాటు అన్నాడీఎంకే నేతలు తన శిబిరంలోకి వచ్చినా, ఆశించిన సంఖ్యలో ఎమ్మెల్యేలు రాకపోవడం పట్ల తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆలోచనలో పడ్డారు. ఆదివారం నాటికి కనీసం 25 మంది శాసనసభ్యులు తన గూటికి చేరుతారని ఆయన భావించారు. అయితే, మంత్రి పాండియరాజన్ మాత్రమే వచ్చి చేరారు. దీంతో శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలకు ఎలా వల వేయాలనే దానిపై పన్నీర్‌సెల్వం వర్గం కసరత్తు చేస్తోంది.
ఎమ్మెల్యేలను ఉంచిన ప్రదేశం ప్రైవేట్‌ది కావడంతో తానే స్వయంగా వెళ్లి వారితో మాట్లాడేందుకు పన్నీర్ సెల్వం సిద్ధమైనట్లు సమాచారం. అయితే, పోలీసు అధికారులు వారించడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ విషయం తెలియడంతో శశికళ మద్దతుదారులు మరింత అప్రమత్తమయ్యారు. రిసార్ట్ చుట్టూ భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
11 మంది ఎంపీల చేరిక
జయలలిత సమాధి సాక్షిగా శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగురవేసి ఐదు రోజులైంది. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేం దుకు ఆయన అనేక వ్యూహాలు అమలు చేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయ కులు, సినీ ప్రముఖుల మద్దతు సంపాదిం చడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఆదివారం సాయంత్రం వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్‌కు జై కొట్టారు. ఇప్పుడు పన్నీర్ వర్గంలో ఆయనతో కలిపి ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆదివారం ఎంపీలు జయసింగ్ త్యాగరాజన్(తూత్తుకుడి), సెంగుట్టువన్ (వేలూరు), మారుతీరాజా (పెరంబలూరు) రాజేంద్రన్ (విల్లుపురం), లక్ష్మణన్ (రాజ్యసభ), పార్తీబన్(తేని) మద్దతు ప్రకటించడంతో పన్నీర్‌కు ఇప్పటివరకూ 11 మంది ఎంపీల బలం తోడైంది.
లోపం ఎక్కడుంది?
అన్నాడీఎంకే ఎంపీలు పన్నీర్ సెల్వం శిబిరంలోకి ఎందుకు పరుగులు తీస్తున్నారు? దీని వెనుక రహస్యం ఏమిటి? అని శశికళ వర్గం ఆరా తీస్తోంది. ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు తమ వద్దకు ఎందుకు రావడం లేదని పన్నీర్ సెల్వం వర్గం మంతనాలు సాగిస్తోంది. లోపం ఎక్కడుంది? మెజారిటీ ఎమ్మెల్యేలను ఆకర్షించాలంటే ఇంకా ఏం చేయాలి? అనే దానిపై పన్నీర్ వర్గంలోని ముఖ్య నేతలు ఆదివారం విస్తృతంగా చర్చిం చారు. సోషల్ మీడియా ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచడం, వారి కుటుంబ సభ్యులను నేరుగా కలవడం, పన్నీర్ సెల్వంతో ఫోన్లో మాట్లాడించి హామీలు ఇప్పించడం వంటి వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయిం చారు. ఇందులో భాగంగానే మంత్రి పాండియ రాజన్ ఆదివారం మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్‌ను కలిసి చర్చలు జరిపారు. పన్నీర్ సెల్వంతో ఫోన్లో మాట్లాడించి ఆహ్వానించేలా చేశారు. అయితే, తాను ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోలేనని నటరాజన్ సమాధానం ఇచ్చారు.
ఎందుకు వెళ్తున్నారో వారినే అడగండి
శశికళ శిబిరం నుంచి మాయమైన ముగ్గురు ఎమ్మెల్యేలు తమవైపు వస్తారని పన్నీర్ సెల్వం భావించినా వారి నుంచి వర్తమానం అందలేదు. మరో రెండు, మూ డు రోజుల్లో తమ వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య మూడంకెలకు (వందకుపైగా) చేరుతుందని పాండియరాజన్ ప్రకటిం చారు. మరోవైపు ఎంపీలు తన పట్టు నుంచి జారిపోతుండడాన్ని శశికళ తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకు వెళుతున్నారో, ఎవరు పంపుతున్నారో వారినే అడగండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం ఎన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్యేలను కాపాడుకోగలుగుతానని శశికళ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆ 32 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ?
శిబిరాలలో ఉన్న ఎమ్మెల్యేల లెక్కలపై తమిళనాట తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శశికళ శిబిరంలో 94 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క తేలింది. పన్నీరు సెల్వం శిబిరంలో ఆయనతో కలిపి ఉన్న ఎమ్మెల్యేలు ఏడుగురు మాత్రమే. తాను తటస్థం అని మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ ప్రకటించారు. మరి అన్నా డీఎంకే నుంచి గెలిచిన 134 మంది ఎమ్మెల్యేలలో మిగిలిన 32 మంది ఎక్కడున్నారు? వాళ్లంతా ఒకే చోట ఉన్నారా లేక వేర్వేరు చోట్ల ఉన్నారా? వారు ఎవరి పక్షం? ఇలాంటి ప్రశ్నలపై అనేక ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వారందరినీ చిన్నమ్మ శశికళే రహస్య ప్రదేశంలో ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.
విచారణలో కనిపించింది 94 మంది
ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్‌లో శశికళ మద్దతుదారులు క్యాంప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారన్న ఆరోపణలపై మద్రాసు హైకోర్టు శుక్రవారం విచారణకు ఆదేశించింది. దీంతో కాంచీపురం పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం ఎమ్మెల్యేల వద్ద విచారణ చేపట్టి, లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. ఈ విచారణ నివేదికను సోమవారం మద్రాసు హైకోర్టుకు సమర్పించనున్నారు. అయితే, 94 మంది ఎమ్మెల్యేలు మాత్రమే క్యాంప్‌లో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కనపించని 32 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం మద్దతుదారులైతే ఇప్పటికే ఆ శిబిరంలో చేరి ఉండేవారని, వారంతా శశికళ మద్దతుదారులేనని ఆమె వర్గం నేతలు చెబుతున్నారు.
కువత్తూరులో ఉద్రిక్తత
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల శిబిరం ఏర్పాటు చేసిన కువత్తూరులో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియాపై శశికళ మద్దతుదారులు విరుచుకుపడ్డారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు శశికళ అక్కడకు రావడంతో మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు. వారిని అక్కడున్న మన్నార్గుడి ప్రైవేటు సెక్యూరిటీ వారు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆ మార్గంలో బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి సముదాయించారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.