రంగన్నకు ఆ ఎమ్మెల్యేలు షాక్
చెన్నై: పుదుచ్చేరి ప్రధాన ప్రతిపక్షంలో రాజకీయ అలజడి బయలుదేరింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరడానికి సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా ఎమ్మెల్యే టీపీఆర్ సెల్వం కాంగ్రెస్‌కు మద్దతుగా గళం విప్పడం గమనార్హం. పుదుచ్చేరి కాంగ్రెస్‌లో ఒకప్పుడు తిరుగులేని నేత ఎన్ రంగస్వామి. ప్రజాబలం కలిగిన ఆయన్ను కాంగ్రెస్ కుటిల రాజకీయాలు వెంటాడాయి.
సీఎం పదవి దూరం కావడంతో 2011లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఏర్పాటుతో అధికార పగ్గాలు సైతం చేపట్టారు. ఐదేళ్ల పాటుగా ఆయన నేతృత్వంలో పుదుచ్చేరి అభివృద్ధి అంతంత మాత్రమే. మంత్రుల అవినీతి భాగోతాలు 2016 ఎన్నికల్లో ముచ్చెమటలు పట్టించాయి. ఆ ఎన్నికల్లో అధికారం దూరం అయ్యింది. 30 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్‌ఆర్ కాంగ్రెస్ నుంచి ఏడుగురు మాత్రమే ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్న రంగస్వామికి ఆ ఎమ్మెల్యేలు పలువురు షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.
సొంతగూటి వైపు చూపు :
ప్రస్తుతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు మాతృగూటి వైపుగా చూస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌లో ఉండటం కన్నా, నియోజకవర్గం అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిండం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం మంత్రి కందస్వామి నేతృత్వంలో లింగారెడ్డి పాళయంలో జరిగిన సభలో ఆ నియోజకవర్గం ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీపీఆర్ సెల్వం కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రసంగాన్ని అందుకున్నారు. ఇది వరకు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒరిగింది శూన్యమేనని, ఇప్పుడు తమ పనులు చక..చకా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు.
నియోజకవర్గం అభివృద్ధి కోసం తనతో పాటుగా పలువురు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్టు ఆయన స్పష్టం చేయడం ఎన్‌ఆర్ కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యేలు ఫిరాయింపులతో కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనన్న ఆందోళన రంగస్వామిలో బయలు దేరింది. దీంతో ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు ప్రయత్నాల్ని వేగవంతం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్న తన ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగించేందుకు నిర్ణయించినట్టు ఎన్‌ఆర్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.