'నేను అనని మాటలను కూడా నివేదికలో పెట్టారు'
హైదరాబాద్: తాను అసెంబ్లీలో అనని మాటలను కూడా బుద్ధప్రసాద్ కమిటీ నివేదికలో పొందుపరచడంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల కమిటీ భేటీ అయ్యింది. ఈ విచారణకు నోటీసులు అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.
సభా హక్కుల కమిటీకి హాజరైన అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ను ఉద్దేశించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు మనసుకు బాధకలిగించాయన్నారు. కమిటీ నివేదికలో ఉన్న మాటలు, ఆడియో, వీడియోల్లో లేవని..ఆ అంశాన్ని కమిటీకి నివేదించినట్లు చెప్పారు. తాను కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడిని..25 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉందని... చట్టసభలను, న్యాయవ్యవస్ధను గౌరవిస్తానని చెవిరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారు. అధికార పక్షం సంయమనం పాటిస్తే ప్రతిపక్షాలు కూడా సంయమనం పాటిస్తాయన్న విషయాన్ని సభా హక్కుల కమిటీకి వెల్లడించినట్లు చెప్పారు.
మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'సభలో నేను ఎప్పుడూ అసభ్యపదజాలం వాడలేదు. ఒక వేళ అసభ్యపదజాలం వాడినట్లు నిరూపిస్తే కమిటీ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటానని' చెప్పారు. అస్వస్థత కారణంగా ఎమ్మెల్యే రోజా ఈ విచారణకు హాజరుకాలేకపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కమిటీకి వెల్లడించినట్లు తెలిపారు.