privilege meeting
-
'నేను అనని మాటలను కూడా నివేదికలో పెట్టారు'
హైదరాబాద్: తాను అసెంబ్లీలో అనని మాటలను కూడా బుద్ధప్రసాద్ కమిటీ నివేదికలో పొందుపరచడంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల కమిటీ భేటీ అయ్యింది. ఈ విచారణకు నోటీసులు అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. సభా హక్కుల కమిటీకి హాజరైన అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు మనసుకు బాధకలిగించాయన్నారు. కమిటీ నివేదికలో ఉన్న మాటలు, ఆడియో, వీడియోల్లో లేవని..ఆ అంశాన్ని కమిటీకి నివేదించినట్లు చెప్పారు. తాను కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడిని..25 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉందని... చట్టసభలను, న్యాయవ్యవస్ధను గౌరవిస్తానని చెవిరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారు. అధికార పక్షం సంయమనం పాటిస్తే ప్రతిపక్షాలు కూడా సంయమనం పాటిస్తాయన్న విషయాన్ని సభా హక్కుల కమిటీకి వెల్లడించినట్లు చెప్పారు. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'సభలో నేను ఎప్పుడూ అసభ్యపదజాలం వాడలేదు. ఒక వేళ అసభ్యపదజాలం వాడినట్లు నిరూపిస్తే కమిటీ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటానని' చెప్పారు. అస్వస్థత కారణంగా ఎమ్మెల్యే రోజా ఈ విచారణకు హాజరుకాలేకపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కమిటీకి వెల్లడించినట్లు తెలిపారు. -
' అచ్చెన్నాయుడుకు అప్పుడే సారీ చెప్పా'
హైదరాబాద్: నోటీసులు అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొడాలి నాని వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాను మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమందిని దూషించినట్లు బుద్ధప్రసాద్ కమిటీ...నివేదిక ఇచ్చిందని ప్రివిలేజ్ కమిటీ చెప్పిందన్నారు. ' మేం పోడియం వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో అచ్చెన్నాయుడు మా పార్టీని, మా నాయకుడిని తిట్టారు. మా పార్టీని సైకో పార్టీ అని, మా నాయకుడిని సైకో అని అచ్చెన్నాయుడు అన్నారు. అప్పుడు ఆవేశంగా కొన్ని మాటలు అన్నమాట వాస్తవమే. అదే కమిటీ ముందు చెప్పాను. అదేరోజు అచ్చెన్నాయుడు బాధపడి ఉంటే సారీ అని చెప్పాను. అచ్చెన్నాయుడు నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కొంతకాలం ఒకేపార్టీలో ఉన్నాం. ఆయనకు బాధ కలిగించి ఉంటే అప్పుడే సారీ చెప్పాను. మా మీద చర్య తీసుకోమని బుద్ధప్రసాద్ కమిటీ చెప్పిందని ప్రివిలేజ్ కమిటీ చెప్పింది. అలాగే నిర్ణయం తీసుకోమని కమిటీకి చెప్పాం' అని ఎమ్మెల్యే నాని తెలిపారు. -
అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్సీపీ లేఖ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సభా హక్కుల కమిటీ భేటీని 15 రోజులు వాయిదా వేయాలని కోరారు. ఈ భేటీకి రోజా హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ హాల్లో శనివారం మధ్యాహ్నం సభా హక్కుల కమిటీ విచారణ జరిగింది. ఈ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకావడం లేదని ఎమ్మెల్యే రోజా కూడా కమిటీకి లేఖ పంపారు.