' అచ్చెన్నాయుడుకు అప్పుడే సారీ చెప్పా'
హైదరాబాద్: నోటీసులు అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొడాలి నాని వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాను మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమందిని దూషించినట్లు బుద్ధప్రసాద్ కమిటీ...నివేదిక ఇచ్చిందని ప్రివిలేజ్ కమిటీ చెప్పిందన్నారు.
' మేం పోడియం వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో అచ్చెన్నాయుడు మా పార్టీని, మా నాయకుడిని తిట్టారు. మా పార్టీని సైకో పార్టీ అని, మా నాయకుడిని సైకో అని అచ్చెన్నాయుడు అన్నారు. అప్పుడు ఆవేశంగా కొన్ని మాటలు అన్నమాట వాస్తవమే. అదే కమిటీ ముందు చెప్పాను. అదేరోజు అచ్చెన్నాయుడు బాధపడి ఉంటే సారీ అని చెప్పాను. అచ్చెన్నాయుడు నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కొంతకాలం ఒకేపార్టీలో ఉన్నాం. ఆయనకు బాధ కలిగించి ఉంటే అప్పుడే సారీ చెప్పాను. మా మీద చర్య తీసుకోమని బుద్ధప్రసాద్ కమిటీ చెప్పిందని ప్రివిలేజ్ కమిటీ చెప్పింది. అలాగే నిర్ణయం తీసుకోమని కమిటీకి చెప్పాం' అని ఎమ్మెల్యే నాని తెలిపారు.