హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్) విమర్శించారు. ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా అధికారంలో ఉన్నవారికి గవర్నర్ భజన చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవడమేనని అన్నారు. ఫిరాయింపుదారులతో ప్రమాణస్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే అసహ్యం వస్తుందని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతుంటే ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని టీపీసీసీని కోరారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తానని వీహెచ్ తెలిపారు. కాగా శనివారం కూడా వీహెచ్ రాజ్‌భవన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘అలా చేయడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవటమే’
Published Mon, Apr 3 2017 8:30 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement