v.hanumantharao
-
‘అలా చేయడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవటమే’
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్) విమర్శించారు. ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా అధికారంలో ఉన్నవారికి గవర్నర్ భజన చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవడమేనని అన్నారు. ఫిరాయింపుదారులతో ప్రమాణస్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే అసహ్యం వస్తుందని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతుంటే ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని టీపీసీసీని కోరారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తానని వీహెచ్ తెలిపారు. కాగా శనివారం కూడా వీహెచ్ రాజ్‌భవన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రిజర్వేషన్ తొలగింపు వెనుక ‘బాబు’ కుట్ర
మున్నూరుకాపులను ఓబీసీ నుంచి తొలగిస్తే పోరాటం రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్ ఆదిలాబాద్ టౌన్ : మున్నూరు కాపు కులస్తులను ఓబీసీ నుంచి తొలగిస్తే పోరాటం చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంత్‌రావు అన్నారు. రిజర్వేషన్ తొలగింపు వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీబీసీ నివేదికను కేంద్ర ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ కులానికి చెందిన వారే అయినప్పటికీ బీసీల సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. బీసీలకు 25 శాతం రిజర్వేషన్ ఉన్నా.. 10 శాతం కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఎలాంటి సర్వేలు చేయకుండా ఏ కొలమానంతో ప్రధానమంత్రి రిజర్వేషన్ తొలగించడానికి కుట్రపన్నుతున్నారని ప్రశ్నించారు. మున్నూరుకాపులో చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయని, కొంతమంది ధనవంతులను చూసి ఓబీసీ నుంచి తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మున్నూరు కాపులు ఏకమై 15 రోజులల్లో కార్యాచరణ తయారు చేసి ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లామోనని బాధపడుతున్నారని, త్వరలో వారు తిరిగి వస్తారని పేర్కొన్నారు. పుటకో మాట చేప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొదండరెడ్డి, నాయకులు సాజిద్‌ఖాన్, సతీష్‌రావు, షఖీల్ పాల్గొన్నారు. -
'హైదరాబాద్ లో అసలు కల్లు ఎలా సాధ్యం'
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో విక్రయిస్తున్నదంతా కల్తీ కల్లేనని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చెట్లు లేని హైదరాబాద్‌లో అసలైన కల్లు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కల్లీకల్లును ప్రభుత్వం వెంటనే నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు కోట్లు ఈత చెట్లు పెంచుతామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. అదే విధంగా ఆ చెట్లు పెరిగాకే వాటి కల్లును విక్రయించాలని చెప్పారు. హైదరాబాద్‌లో కల్లు విక్రయాలతో లాభ పడుతున్నది మద్యం కాంట్రాక్టర్లేనని ఆయన ఆరోపించారు. అంతే కానీ గీత కార్మికులకు ఒరిగిందేమీ లేదని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వీఐపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు: తిరుపతి అర్బన్ ఎస్పీ
అలిపిరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావు కారుపై చెప్పులు పడిన సంఘటన మీద అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు స్పందించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోడానికి శనివారం తిరుమల వచ్చిన ఆయన.. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు ఉద్యోగాలు చేయటానికి అర్హులు కాదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు నివసించవచ్చు కానీ... ఉద్యోగాలు చేయరాదంటూ వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సమైక్యవాదులు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అలిపిరి దిగువ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. ఈ సంఘటనపై అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పందించారు. వీఐపీలు ఎవరు వచ్చినా వారు తిరుమల పవిత్రతను కాపాడేలా ఉండాలని ఆయన సూచించారు. తిరుమలకు వచ్చే ఏ వీఐపీ అయినా ఉద్యమకారులను చెర్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, వీహెచ్ చేసిన వ్యాఖ్యల వల్లే ఉద్యమకారులు ఆవేశానికి గురయ్యారని ఎస్పీ చెప్పారు. జడ్ ప్లస్ కేటగిరీ కన్నా ఎక్కువ భద్రతను వీహెచ్‌కు కల్పించామని, అలిపిరి ఘటనలో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. దాడులకు పాల్పడినవారిని కూడా గుర్తించామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో సీమాంధ్రుల విషయమై వీహెచ్ చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.