
సంచలనాల మోత
►డిఫెండింగ్ చాంపియన్ ముగురుజాపై మ్లాడెనోవిచ్ అద్భుత విజయం
►వీనస్, రావ్‌నిచ్ ఇంటిముఖం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆదివారం సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)... ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)... పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)... పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) ఇంటిముఖం పట్టారు.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ అమ్మాయి, 13వ సీడ్ క్రిస్టినా మ్లాడెనోవిచ్ అద్వితీయ ఆటతీరును కనబరిచి 6–1, 3–6, 6–3తో ముగురుజాను మట్టి కరిపించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మ్లాడెనోవిచ్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–1, 4–6, 6–2తో 2009 చాంపియన్ కుజ్‌నెత్సోవాను... 30వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 5–7, 6–2, 6–1తో వీనస్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను దక్కించుకున్నారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–1తో వితోఫ్ట్ (జర్మనీ)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 7–5తో లినెట్టా (పోలాండ్)పై గెలిచారు.
నాదల్ జోరు...
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–1, 6–2, 6–2తో బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరోవైపు 20వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) 4–6, 7–6 (7/2), 6–7 (6/8), 6–4, 8–6తో మిలోస్ రావ్‌నిచ్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు.
మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో సానియా జంట
పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో బోపన్న (భారత్)–క్యువాస్ (ఉరుగ్వే) జంట 6–7 (5/7), 2–6తో జేమీ ముర్రే (బ్రిటన్)–సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతి లో... దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) ద్వయం 6–4, 6–7 (5/7), 2–6తో హారిసన్ (అమెరికా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)–డోడిగ్ (క్రొయేషియా) జంట 6–2, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)–సితాక్ (న్యూజిలాండ్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.