లైవ్: అఖిలేశ్ తిరుగుబాటు చేస్తారని అనుకోలేదు!
ఉత్తరప్రదేశ్ తాజా అప్‌డేట్స్..
లక్నో: 2012లో అఖిలేశ్ యాదవ్‌ను ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిని చేశారని, కానీ ఇలాంటిరోజు ఒకటి వస్తుందని ఇద్దరు అప్పట్లో ఊహించలేదని ఎస్పీ నేత మధుకర్ జైట్లీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ తన తప్పును ఒప్పుకొంటే.. ఆయనపై బహిష్కరణ వేటును ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నిస్తానని నేతాజీ చెప్పారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తండ్రిపై అఖిలేశ్ తిరుగుబాటుచేసే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార ప్రతినిధి రాజీనామా..
ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన సీఎం అఖిలేశ్ యాదవ్‌కు మద్దతుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి జూహి సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తాను ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు వ్యతిరేకం కాదని, కానీ సీఎం అఖిలేశ్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. పార్టీ నుంచి సీఎంను సస్పెండ్ చేస్తే.. అధికార ప్రతినిధి కూడా రాజీనామా చేయాల్సిన అవసరముంటుందని ఆమె పేర్కొన్నారు.
అందరి మద్దతు అఖిలేశ్‌కే..
యావత్ ఉత్తరప్రదేశ్ ప్రజల మద్దతు అఖిలేశ్‌కు ఉందని, ఆయన వెంట నడిచేందుకు యువత, మహిళలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ ఎమ్మెల్యే పవన్ పాండే అన్నారు. అఖిలేశ్ వర్గం ఎమ్మెల్యేల భేటీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖిలేశ్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.
హలో అఖిలేశ్..
ఉత్తరప్రదేశ్‌లోని తాజా రాజకీయాల నేపథ్యంలో సీఎం అఖిలేశ్ యాదవ్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభంలో దృఢంగా ముందుకు సాగాలని సూచిస్తూ ఆయనకు శుభాభినందలు మమత తెలిపారు.
ములాయంకే నా మద్దతు: అమర్‌సింగ్
ఎంతో కష్టపడి సమాజ్‌వాదీ పార్టీని ములాయం సింగ్ నిర్మించారని, తాజా సంక్షోభంలో ఆయనకే తన మద్దతు ఉంటుందని సీనియర్ నేత అమర్‌సింగ్ స్పష్టం చేశారు.