లక్నో: ఎస్పీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నివాసం వద్ద నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ అఖిలేశ్‌ను, ఆయన చిన్నాన్న రాంగోపాల్ యాదవ్‌ను ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ కార్యాచరణ కోసం అఖిలేశ్ యాదవ్ తన నివాసంలో ఎస్పీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి పెద్ద ఎత్తున అఖిలేశ్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు.
మొత్తం 12 మంది మంత్రులు, 150 మంది ఎమ్మెల్యేలు, 35మంది ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎస్పీపై సీఎం అఖిలేశ్ పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు పలికారు. మరోవైపు అఖిలేశ్ ప్రత్యర్థి శివ్‌పాల్ యాదవ్ శిబిరంలో కొంత నిరాశ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అబ్బాయికి జై కొట్టడంతో బాబాయి మిగతా వారిని పోగేసి.. భవిష్యత్తు కార్యాచరణ కోసం సమయాత్తమవుతున్నారు.
ఈ భేటీ నేపథ్యంలో అఖిలేశ్ నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు, ఎస్పీ కార్యకర్తల సందడి కనిపిస్తోంది. అఖిలేశ్‌కు మద్దతుగా, శివ్‌పాల్ యాదవ్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. అఖిలేశ్ నివాసం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ యువనేతకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుండటం గమనార్హం. తాము ఎస్పీ సుప్రీం ములాయంను ధిక్కరించడం లేదని, కానీ రానున్న ఎన్నికల్లో ఎస్పీ సీఎం అభ్యర్థిగా అఖిలేశ్‌యే ఉండాలని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.