అఖిలేశ్‌కు పొంచి ఉన్న మహాగండం!
- బలపరీక్షకు సిద్ధపడాలని గవర్నర్ ఆదేశించే అవకాశం
లక్నో: సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్లపాటు ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆరేళ్లపాటు బహిష్కరించడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ములాయం నిర్ణయం నేపథ్యంలో ఎస్పీని నిట్టనిలువునా చీల్చి సొంత కుంపటి పెట్టేదిశగా అఖిలేశ్ యాదవ్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన సొంత కుంపటి పెడితే.. ఆయనతో జత కలిసేందుకు సిద్ధమని మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం అఖిలేశ్ యాదవ్ శనివారం తన నివాసంలో మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో అఖిలేశ్ వర్గీయులుగా పేరుపడిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా సీఎం ఇంటికి క్యూ కట్టారు.
రంగంలోకి గవర్నర్!
అధికార పార్టీ ఎస్పీలోని పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ రంగంలోకి దిగారు. అఖిలేశ్‌ను ఆరేళ్లపాటు ఎస్పీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు సిద్ధపడి.. మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్.. అఖిలేశ్‌ను ఆదేశించే అవకాశముందని తెలుస్తోంది. జనవరి 3న యూపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో 72 గంటలలోపే బలపరీక్షకు సిద్ధపడాలని గవర్నర్ ఆదేశించే అవకాశముందని వినిపిస్తోంది. మరోవైపు ఎస్పీలోని తాజా సంక్షోభంపై స్పందించిన గవర్నర్.. పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నట్టు ప్రకటించారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో అఖిలేశ్‌ను, రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ చీఫ్ ములాయం ఆరేళ్లు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.