నాన్నకు ప్రేమతో.. అఖిలేశ్ ఉద్వేగ ప్రసంగం!
లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్ తనను ఆరేళ్లపాటు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ భావోద్వేగంగా స్పందించారు. తాను ఇప్పటికీ నాన్నతోనే ఉన్నానని ఆయన అన్నారు. ఎస్పీలో ముసలం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆయన శనివారం తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఒకింత ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. తాను బహిష్కరణకు గురయింది పార్టీ నుంచే కానీ, కుటుంబం నుంచి కాదని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. దానిని నాన్న ములాయంకు బహుమతిగా ఇద్దామని అఖిలేశ్ పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల జాబితాతో తండ్రి ములాయం ఆశీర్వాదం తీసుకునేందుకు ఆయన ఇంటికి అఖిలేశ్ బయలుదేరారు. ఎస్పీని చీల్చి సొంతంగా పార్టీ పెట్టే దిశగా అఖిలేశ్ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎస్పీ నుంచే కాకుండా జాతీయ నేతల మద్దతు కూడా లభిస్తుండటం గమనార్హం. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అఖిలేశ్ ఫోన్ చేసి మాట్లాడగా.. కాంగ్రెస్ పార్టీ ఆయనతో పొత్తుకు సై అని సంకేతాలు ఇచ్చింది.