బ్రేకింగ్: ములాయం-అఖిలేశ్ సంధి
లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ముగిసింది. గత కొన్ని గంటలుగా కొనసాగుతున్న యాదవ్ పరి'వార్' హైడ్రామాకు తెరపడింది. నిట్టనిలువునా చీలిపోయేందుకు సిద్ధపడిన ఎస్పీ.. తండ్రి-కొడుకుల రాజీతో కుదురుకుంది. తండ్రి ములాయం, కొడుకు అఖిలేశ్‌లతో ఎస్పీ సీనియర్ నేత, మంత్రి ఆజంఖాన్ నెరిపిన దౌత్యం ఫలించింది. దీంతో అఖిలేశ్ యాదవ్, రాంగోపాల్ యాదవ్‌పై ఆరేళ్ల సస్పెన్షన్‌ను ఎస్పీ ఎత్తివేసింది. వారిద్దరిని తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
అంతకుముందు ఉదయం నుంచి యూపీలో అనేక నాటకీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనను బహిష్కరించడంతో సీఎం అఖిలేశ్ యాదవ్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తన నివాసంలో భేటీ నిర్వహించారు. ఈ భేటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఏకంగా ఎస్పీ 190 మంది ఎమ్మెల్యేలు, 35మందికి పైగా ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరై అబ్బాయికి జైకొట్టారు. ఈ పరిణామంతో ప్రత్యర్థి శివ్‌పాల్ యాదవ్ వర్గం బిత్తరపోయింది. ఇంతలోనే తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల జాబితా తీసుకొని చివరి ప్రయత్నంగా అఖిలేశ్ ములాయం ఇంటికి వెళ్లారు.
అప్పటికే అక్కడున్న సీనియర్ మంత్రి ఆజంఖాన్ ఇటు ములాయంతో, అటు అఖిలేశ్‌తో వేర్వేరుగా సమావేశమై.. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో అఖిలేశ్‌పై, రాంగోపాల్ యాదవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ములాయం అంగీకరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని సీఎం అఖిలేశ్‌ను, ఆయన సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ చీఫ్ ములాయం ఆరేళ్లు బహిష్కరించిన సంగతి తెలిసిందే.
అయితే, అఖిలేశ్ తన బలప్రదర్శన నిరూపించుకొని, ఆధిపత్యాన్ని చాటుకున్న తర్వాత ములాయం మెత్తబడటం గమనార్హం. ఎస్పీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నేతలు అఖిలేశ్‌కు జైకొట్టడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ములాయం అండగా ఉన్న శివ్‌పాల్ వర్గం వెనుకకు తగ్గినట్టు తెలుస్తోంది. ఈ దౌత్యంలో సమీప బంధువు, లాలూప్రసాద్ యాదవ్ కూడా కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఆధిపత్య పోరుకు తెరతీసిన అభ్యర్థుల ఎంపిక అంశంపై ఇకముందు నేతలంతా కలిసి కూచోని మాట్లాడుకుంటామని శివపాల్ యాదవ్ అంటున్నారు.