తిరుపతి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో పనిచేస్తున్న అవినీతి నిరోధక సంస్థలైన సీబీఐ, ఏసీబీలు కేవలం ప్రభుత్వ అధికారులపైనే కాకుండా కుంభకోణాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కూడా దాడులు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తిరుపతిలో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగుల జేఏసీ చేపట్టిన సమ్మెలో సంఘీభావంగా బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులను పట్టుకోవడం మంచిదే అయినప్పటికీ ప్రజాప్రతినిధులుగా ఉంటూ కోట్లాది రూపాయల స్కాంలకు పాల్పడే ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి ప్రజాస్వామ్యం ఎక్కడుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటూ దశాబ్దాలతరబడి ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగులకు ఏవైనా భత్యాలు, సౌకర్యాలు కల్పించాలంటే ఆర్థిక అంశాలతో ముడిపెట్టి ఆలోచించే ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు పెంచేందుకు మాత్రం క్షణం కూడా వెనుకాడవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూలై నుంచే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేక పవనాలు ఆరంభమయ్యాయని, దానిప్రభావం రానున్న గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఆవేదన ఏంటో వెల్లడించనున్నారని జోస్యం చెప్పారు. ఇంగ్లాండ్‌లో 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొన్నటి జూన్ ఎన్నికల్లో ఉద్యోగులు, ఓటర్లు సరైన తీర్పునిచ్చి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment