bsnl employees
-
బీఎస్ఎన్ఎల్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 62 వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్కు కేంద్రం ఈమధ్యే కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఇకపై బీఎస్ఎన్ఎల్ మెరుగైన ప్రదర్శన కనబర్చాలని.. ఒకవేళ పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోవాలని, లేకుంటే పంపించేయాల్సి ఉంటుందని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదేం చిన్నకేటాయింపు కాదు. పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించిన విధానం.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నంత భారీ రిస్క్ ప్రపంచంలో మరే ప్రభుత్వం చేపట్టలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ► ప్రతీ నెలా పనికి సంబంధించి నేనే సమీక్ష నిర్వహిస్తా. పని చేయనివాళ్లు, చేతకానీ వాళ్లు స్వచ్చందంగా విరమణ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోండి. లేదంటే.. రైల్వేలో జరిగినట్లుగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందేలా చేస్తాం. ► BSNL ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే కేంద్ర కేబినెట్ భారీ ప్యాకేజీని ప్రకటించింది. మేము చేయవలసింది చేశాం. ఇక ఇప్పుడు చేయాల్సింది మీరే. పని చేయండి లేదంటే వెళ్లిపోండి. ► ఈ పోటీ పరిశ్రమలో మీ పనితీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాబోయే 24 నెలల్లో మంచి ఫలితాలను చూడాలనుకుంటున్నా. నేనే మీ పనితీరుపై నెలవారీ నివేదిక చూస్తా అంటూ ఆయన మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. గురువారం బీఎస్ఎన్ఎల్ సీనియర్ మేనేజ్మెంట్తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సందర్భంగా అక్కడ జరిగిన భేటీకి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు లీక్ అయ్యింది. అయితే ఆ ఐదు నిమిషాల క్లిప్ ఒరిజినల్‌దే అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అదనంగా.. ఇదిలా ఉంటే.. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (BBNL)ని BSNLతో విలీనం చేసే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విలీనం ద్వారా, BSNL దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను అదనంగా పొందుతుంది. ప్రస్తుతం, బీఎస్ఎన్ఎల్కు 6.83 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉంది. ఇదీ చదవండి: ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి? -
నేడు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: తప్పనిసరిగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఎంచుకునేలా కింది స్థాయి సిబ్బందిని యాజమాన్యం భయాందోళనలకు గురి చేస్తోందంటూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ నవంబర్ 25న (నేడు) దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు దిగనున్నట్లు సంస్థ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. వీఆర్ఎస్ తీసుకోని వారి రిటైర్మెంట్ వయస్సును 58 ఏళ్లకు తగ్గించేస్తామంటూ, దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇస్తామంటూ మేనేజ్మెంట్ బెదిరిస్తోందని ఆలిండియా యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ (ఏయూఏబీ) కనీ్వనర్ పి. అభిమన్యు ఆరోపించారు. -
ఆ ఉద్యోగులు రూ. 90 లక్షలు పొందనున్నారా ?
న్యూఢిల్లీ : బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద 50 సంవత్సరాలు పైబడిన కొంత మంది ఉద్యోగులు రూ. 90 లక్షలు ప్యాకేజీ పొందే అవకాశం ఉంది. దీంతో 50 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు పెద్ద మొత్తంలో వీఆర్ఎస్ను ఎంచుకునే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల చేపట్టిన స్వచ్ఛంద పదవి విరమణ పథకం ప్రకారం 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగులు పదవి విరమణను ఎంచుకోవడానికి అర్హులుగా ప్రకటించింది. దీంతో బీఎస్ఎన్లో పని చేస్తున్న 1.6 లక్షల మంది ఉద్యోగుల్లో కనీసం 63శాతం అంటే లక్ష మంది వీఆర్ఎస్ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రెండు వారాల్లోనే ఈ పథకానికి దాదాపు 80వేల మంది ఎన్రోల్ చేసుకున్నారు. డిసెంబరు 3వ తేదీ వరకు అవకాశం ఉండడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీఎస్ఎన్లో ఉద్యోగులకు ప్రస్తుత పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు కాగా, 55 ఏళ్లు నిండిన వారికి వీఆర్ఎస్ పథకం కింద మిగిలిన ఐదేళ్ల కాలానికి జీతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రసుత్తం వీఆర్ఎస్ పొందే ఉద్యోగులు జీతంతో పాటు అదనంగా పొందనున్న పదవీ విరమణ ప్యాకేజీతో లక్షాధికారులుగానే రిటైర్ అవ్వనున్నట్లు తేలింది. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ నెలవారీ జీతం బడ్జెట్ సుమారు రూ .1,200 కోట్లు ఉండగా, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వ్యక్తులు నెలకు కనీసం 75,000 రూపాయల జీతం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ పథకాన్ని ఎంచుకున్న 50 సంవత్సరాల వయస్సులో ఉన్న కొంతమంది ఉద్యోగులు రూ .90 లక్షల విరమణ ప్యాకేజీని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక 50 ఏళ్ల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సుమారు 75,000 రూపాయలు సంపాదిస్తున్నారని అనుకున్నా, వీఆర్ఎస్ తీసుకుంటే ఇంకా 10 సంవత్సరాల సేవ మిగిలి ఉంటుంది. దీంతో సదరు ఉద్యోగికి ఆ మొత్తం కాలానికి వేతనంతో పాటు ప్యాకేజీ లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, 59 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగి వీఆర్ఎస్ను ఎంచుకుంటే సుమారు రూ.9 లక్షల రూపాయలు పొందుతారు. అయితే పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల జీతానికి రక్షణ ఉంటుందని, కేబినెట్ నిర్ణయం ప్రకారం వారికి పూర్తి జీతం లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు బొనాంజా..
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వేతన, పెన్షన్ సవరణలతో పాటు వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలకు అనుకూలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని టెలికమ్యూనికేషన్ల మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని మంత్రి చెప్పారు. కాగా, బీఎస్ఎన్ఎల్లో ప్రస్తుత ఉద్యోగుల వేతన సవరణతో ముడిపెట్టకుండా తమకు వేరుగా పెన్షన్ సవరణ చేపట్టాలన్నరిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్‌కు టెలికాం మంత్రిత్వ శాఖ అంగీకరించిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 15 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణకు మార్గం సుగమం కానుంది. బీఎస్ఎన్ఎల్కు మార్కెట్ వాటా బలోపేతం కోసం సంస్థకు 4జీ స్పెక్ర్టమ్ కేటాయించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్‌ను నొక్కిచెబుతూ నిరవధిక సమ్మెకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవగా బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు కోరుతూ టెలికాం శాఖ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేయడం గమనార్హం. -
3 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు డిసెంబర్ 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కొత్త టెల్కో రిలయన్స్ జియోపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలే ఇందుకు కారణం. టెలికం సేవల్లో జియోతో పోటీపడకుండా చేసేలా బీఎస్ఎన్ఎల్కు కేంద్రం 4జీ స్పెక్ట్రం కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ‘ప్రస్తుతం మొత్తం టెలికం రంగం అంతా కూడా సంక్షోభంలో ఉంది. ఇదంతా కూడా ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో కారుచౌక చార్జీలతో మిగతా సంస్థలను దెబ్బతీయడం వల్లే జరుగుతోంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సహా ఇతర పోటీ సంస్థలన్నింటినీ నామరూపాల్లేకుండా చేయాలన్నదే జియో వ్యూహం. ఆ తర్వాత నుంచి కాల్, డేటా చార్జీలను ఎకాయెకిన పెంచేస్తూ ప్రజలను లూటీ చేయబోతోంది. ఇలాంటి రిలయన్స్ జియోకి నరేంద్ర మోదీ ప్రభుత్వం బాహాటంగా మద్దతునిస్తుండటం ఆందోళనకరం’ అని బీఎస్ఎన్ఎల్ యూనియన్లు(ఏయూఏబీ) ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించాయి. 4జీ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన స్పెక్ట్రంను తక్షణం కేటాయించడం, 2017 జనవరి 1 నుంచి వర్తించేలా ఉద్యోగుల జీతాలు, రిటైరీల పెన్షన్ సవరణ తదితర అంశాలను డిమాండ్ చేస్తున్నట్లు వివరించాయి. పోటీ సంస్థలను దెబ్బతీసేందుకు భారీగా అర్థబలం ఉన్న రిలయన్స్ జియో .. వ్యయాల కన్నా తక్కువ రేట్లతో సేవలు అందిస్తోందన్నాయి. దీంతో ఎయిర్‌సెల్, టాటా టెలీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టెలినార్ వంటి సంస్థలు మొబైల్ సర్వీసుల నుంచి తప్పుకున్నాయని పేర్కొన్నాయి. -
జయపురం పోలీస్‌స్టేషన్‌లో..
జయపురం ఒరిస్సా : తమ కాంట్రాక్టర్ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదంటూ బీఎస్ఎన్ఎల్ ఒప్పంద ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ప్రహ్లాద్ కుమార్ మల్లిక్‌పై బీఎస్ఎన్ఎల్ క్యాజువల్, కాంట్రాక్ట్ కర్మాచారీ సంఘం కొరాపుట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్రగౌడ ఉద్యోగులతో కలిసి జయపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలంటూ సుమారు 20 రోజుల నుంచి బీఎస్ఎన్ఎల్ ఒప్పంద ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమతో పనులు చేయించుకుని జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. సుమారు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో పాటు ఉద్యోగులను చిన్న చూపు చస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్లో సుమారు 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నా, పనికి తగ్గ వేతనం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ తక్కువ జీతాలిచ్చి, తమతో అధిక పని చేయించుకుంటున్నారని విమర్శించారు. ఇదే విషయమై యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనానికే పని చేస్తున్నా ఇతర సదుపాయాలు కూడా సంస్థ కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. దీంతో ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవిస్తున్నామని వాపోయారు. జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో పాటు పాత బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ప్రస్తుతం అవి చెల్లించడం లేదని వివరించారు. ఆగష్టు 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరారు. -
ప్రజాప్రతినిధులపై సీబీఐ, ఏసీబీ దాడులు జరగాలి
తిరుపతి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో పనిచేస్తున్న అవినీతి నిరోధక సంస్థలైన సీబీఐ, ఏసీబీలు కేవలం ప్రభుత్వ అధికారులపైనే కాకుండా కుంభకోణాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కూడా దాడులు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తిరుపతిలో బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగుల జేఏసీ చేపట్టిన సమ్మెలో సంఘీభావంగా బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులను పట్టుకోవడం మంచిదే అయినప్పటికీ ప్రజాప్రతినిధులుగా ఉంటూ కోట్లాది రూపాయల స్కాంలకు పాల్పడే ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి ప్రజాస్వామ్యం ఎక్కడుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటూ దశాబ్దాలతరబడి ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగులకు ఏవైనా భత్యాలు, సౌకర్యాలు కల్పించాలంటే ఆర్థిక అంశాలతో ముడిపెట్టి ఆలోచించే ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు పెంచేందుకు మాత్రం క్షణం కూడా వెనుకాడవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూలై నుంచే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేక పవనాలు ఆరంభమయ్యాయని, దానిప్రభావం రానున్న గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఆవేదన ఏంటో వెల్లడించనున్నారని జోస్యం చెప్పారు. ఇంగ్లాండ్‌లో 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొన్నటి జూన్ ఎన్నికల్లో ఉద్యోగులు, ఓటర్లు సరైన తీర్పునిచ్చి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నారన్నారు. -
బంద్‌కు పిలుపునిచ్చిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఒక్క రోజు బంద్ చేపట్టనున్నారు. మూడో వేతన సమీక్ష కమిటీ ప్రకారం వేతనాలు పెంచడం లేదని జూలై 27న వీరు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఆధారితంగా వేతనాలు పెంచాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. ''బీఎస్ఎన్ఎల్ నష్టాల్లో నడిచే కంపెనీ అయితే అది ఉద్యోగుల వల్ల కాదని, యాంటీ-బీఎస్ఎన్ఎల్ విధానాలను, పద్ధతులను ప్రభుత్వం అవలంభించడంతో ఇది నష్టాల్లోకి వెళ్లింది'' అని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ యూనియన్ కన్వినర్ పీ. అభిమన్యు చెప్పారు. 2006 నుంచి 2012 వరకు తమ మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి అవసరమైన పరికరాలను సేకరించేందుకు బీఎస్ఎన్ఎల్కు అనుమతే ఇవ్వలేదని తెలిపారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ప్రయోజనార్థం మొబైల్ పరికరాల కోసం బీఎస్ఎన్ఎల్ చేపట్టిన టెండర్లను రద్దు చేశాయరని అభిమన్యు ఆరోపించారు. దీంతో మొబైల్ సెగ్మెంట్లో బీఎస్ఎన్ఎల్ ఎలాంటి గణనీయమైన వృద్ధి సాధించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. 2013-14లో బీఎస్ఎన్ఎల్కు రూ.691 కోట్ల నిర్వహణ నష్టాలుంటే, 2015-16కు వచ్చే సరికి అవి రూ.3,854 కోట్లకు పెరిగాయి. రిలయన్స్ జియో నుంచి వస్తున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడానికి బీఎస్ఎన్ఎల్ ఎంతో ప్రయత్నిస్తోంది. ఈ పోటీని తట్టుకుని కూడా నెలకు బీఎస్ఎన్ఎల్ 20 లక్షల మంది కొత్త మొబైల్ కస్టమర్లను తన సొంతం చేసుకుంటుంది. వచ్చే రెండు-మూడేళ్లలో బీఎస్ఎన్ఎల్ లాభాల పీఎస్‌యూ కంపెనీల్లో ఒకటిగా నిలవనుందని అభిమన్యు చెప్పారు. జూలై 19న కేబినెట్ మూడో వేతన సమీక్ష కమిటీ ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం, ఎవరైతే గత మూడేళ్ల నుంచి లాభాలను పొందుతున్నారో అంటే కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే తమ ఉద్యోగులకు వేతనాలను సమీక్షించుకునే అర్హతను పొందాయని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చెప్పారు. ఈ మేరకు తాము జూలై 27న ఒక్క రోజు బంద్‌ను చేపట్టనున్నామని ఆఫీసర్లు, వర్కర్లు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే, యూనియన్లు, అసోసియేషన్లు కలిసి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. -
నేడు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సర్కిల్ కాన్ఫరెన్స్
అనంతపురం రూరల్ : సంచార్ నిగమ్ ఉద్యోగుల అసోసియేషన్ (ఎస్ఎన్ఏ) 21వ సర్కిల్ కాన్ఫరెన్స్‌ను నగరంలోని మాసినేని గ్రాండ్లో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎన్ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, లింగమయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ కార్యదర్శులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఎస్ఎన్ఏ ఉద్యోగులు హాజరు కావాలని కోరారు. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ధర్నా
ప్రత్యేక సెల్ టవర్ కంపెనీ ఏర్పాటు నిర్ణయంపై... శ్రీకాకుళం అర్బన్ : భారత సంచార నిగమ్ లిమిటెడ్ సంస్థలో ప్రత్యేక సెల్ టవర్ కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఫోరమ్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ అసోసియేషన్ జిల్లా శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్లో ప్రత్యేక సెల్ టవర్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆలిండియా ఫోరం ఆఫ్ బీఎస్ఎన్ఎల్ యూనియన్ దేశవ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళంలోని సంచార భవన్ వద్ద శుక్రవారం ధర్నా చేశా రు. ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ మాతల గోవర్ధనరావు మాట్లాడుతూ ఇప్పటికే రూ.40వేల కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థను మరింత నష్టాల్లోకి నెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. సంస్థ నిధుల కొరత కారణంగా తగినన్ని సెల్ టవర్స్ లేని కారణంగా సంస్థ వినియోగదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రత్యేక సెల్ టవర్స్ కంపెనీ ఏర్పాటు బీఎస్ఎన్ఎల్ ప్రవేటీకరణకు దారి తీస్తుం దన్నారు. సంస్థ పరిరక్షణకు ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకుంటే డిసెంబరు 15న ఒక రోజు దేశ వ్యాప్త సమ్మె చేయనున్నామని హెచ్చరించారు. ధర్నాలో ఫోరం ఆఫ్ బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు పి.వెంకటరావు, వెలమల శ్రీనివాసరావు, రాజశేఖర్, లక్ష్మణరావు, ఎం.రమేష్, ఎం.ఎస్.కిరణ్‌కుమార్, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె
తిరువళ్లూరు : టెలిఫోన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరువళ్లూరు జిల్లా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజు సమ్మె ను పాటించారు. జిల్లా వ్యాప్తంగా వున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. తిరువళ్లూరు ప్రధాన కార్యాలయం వద్ద జరిగి న ఆందోళనకు ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు మది వానన్ అధ్యక్షత వహించగా, జేఏసీ నేతల గోవిందరా జ్, లింగమూర్తి, విజయకుమార్, అన్బురాజ్, మురుగన్‌తోపాటు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్బంగా జేఏసీ నేతలు పలువురు మాట్లాడుతూ ఉన్నత అధికారులు అధికారిక పర్యటనలు, విదేశీ పర్యటనల పేరిట కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని, అయితే సామాన్య ఉద్యోగికి మాత్రం అందాల్సిన వేతనాలను పెంచడం కోసం ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు నిల్వ వున్న వేతనాలను పెంచడం, 2007 తరువాత వచ్చిన ఉద్యోగులకు వేతనాల సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. అర్హత ఉన్న వారికి ప్రమోషన్లను కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. టెలిపోన్ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందిన వారికి 78.2 శాతం ఐడీఏ చెల్లించాలని, వారసులకు ఉద్యోగం ఇచ్చే విషయంలో వున్న కఠిన నిబంధనలను వెంటనే సుల భతరం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర సదుపాయాలను కల్పించాలని, తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించడంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐలను వర్తింప చేయాలని సూచించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు జేఏసీ నేతలతో పాటు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె
ఆదిలాబాద్ రిమ్స్ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు గురువారం ఒక్కరోజు సమ్మెకు దిగారు. జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బీఎస్ఎన్ఎల్ నాన్ ఎగ్జిక్యూటీవ్ యూనియన్ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమ్మె చేపట్టారు. కమిటీ కార్యదర్శులు సుభాష్ నరేందర్ మాట్లాడుతూ రెగ్యులర్ మజ్ధూర్, గ్రూప్-డి తదితర కేడర్లలో ఏర్పడిన స్టాగ్నేషన్పే 2007 నుంచి నియమించిన ఉద్యోగులు, అంతకుముందు ఉన్న ఉద్యోగుల వేతన వ్యత్యాసాన్ని సవరించాలన్నారు. బోనస్ చెల్లింపులకు ఒప్పందం కుదుర్చుకోవాలని, ఎల్టీసీ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ అలవెన్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టెలికాం ఫ్యాక్టరీలను పునరుద్ధరించి, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులతోనే కాల్‌సెంటర్లు నిర్వహించాలని కోరారు. ఇలా ఎన్నో సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు విలాస్, అంజన్‌గౌడ్, సోమయాజులు, రవి, ఎంఏ గని, సయ్యద్ అజార్షా, తదితరులు పాల్గొన్నారు. మొండివైఖరి వల్లే ఉద్యోగుల్లో ఆందోళన మంచిర్యాల సిటీ : యాజమాన్యం మొండివైఖరి వ ల్ల సమస్యలు పరిష్కారం కాక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని ఆ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నాగేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మంచిర్యాలలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో మాట్లాడారు. గతంలో అనేక ఆందోళన చేసినా యాజమాన్యం స్పందించలేదన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి బాలవెంటకరెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, లక్ష్మీనారాయణ, రుబీన్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ఆకస్మిక సమ్మె
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : బదిలీ అయిన ఉద్యోగుల బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ సబ్ డివిజన్ ఇంజినీర్ విభాగంలో కేవలం 37 శాతం మంది ఉద్యోగులే పని చేస్తున్నారని చెప్పారు. ఎల్లారెడ్డి,బోధన్,మోర్తాడ్,కిసాన్‌నగర్ సబ్ డివిజన్లకు ఇంజినీర్లు లేరన్నారు. అలాగే జిల్లాలో జేటీవోలు కేవలం 40 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న జేటీవోలు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వారి స్థానంలో మరొకరు రాకముందే పైరవీలు చేసి రిలీవ్ అవుతున్నారని ఆరోపించారు. దీంతో జిల్లాలో బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. మార్కెటింగ్ విభాగంలో పని చేసే జేటీవోలను జీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులు నియమించారన్నారు. అక్కడ జేటీవోలతో చిన్న చిన్న పనులను చేయిస్తున్నారని,దీంతో కస్టమర్ కేర్ సెంటర్లలో అనేక పనులు పెండింగ్‌లో పడుతున్నాయన్నా రు. సమ్మెలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశం,ఉపాధ్యక్షుడు మధుసూదన్,సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ,మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి,బ్రాంచ్ కార్యదర్శి రఘనందన్,నాయకులు గంగాధర్,బాల గంగయ్య,సాయిలు తదితరులు పాల్గొన్నారు. కస్టమర్ కేర్ సెంటర్ల మూసివేత.. ఉద్యోగులు ఆకస్మాత్తుగా సమ్మె చేపట్టడంతో కస్టమర్ కేర్ సెంటర్లు మూసివేశారు. జిల్లా కేంద్రంలోని సెల్వన్ కార్యాలయం,వినాయక్‌నగర్,కంఠేశ్వర్‌లోని కస్టమర్ కేర్ సెంటర్లు మూసివేశారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు ఆకస్మాత్తుగా సమ్మెకు దిగడం పలు అనుమానాలు తావి స్తోంది. సమ్మె, ధర్నాలు చేసేముందు ఉద్యోగులు త మ పైఅధికారులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. కాని గురువారం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆకస్మాత్తుగా ధర్నాకు దిగడంపై ఉన్నతాధికారులు వీరిపై చర్యలకు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.