జయపురం: పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఒప్పంద ఉద్యోగులు
జయపురం ఒరిస్సా : తమ కాంట్రాక్టర్ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదంటూ బీఎస్‌ఎన్‌ఎల్ ఒప్పంద ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ప్రహ్లాద్ కుమార్ మల్లిక్‌పై బీఎస్‌ఎన్‌ఎల్ క్యాజువల్, కాంట్రాక్ట్ కర్మాచారీ సంఘం కొరాపుట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్రగౌడ ఉద్యోగులతో కలిసి జయపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలంటూ సుమారు 20 రోజుల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఒప్పంద ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమతో పనులు చేయించుకుని జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. సుమారు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో పాటు ఉద్యోగులను చిన్న చూపు చస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో సుమారు 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నా, పనికి తగ్గ వేతనం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ తక్కువ జీతాలిచ్చి, తమతో అధిక పని చేయించుకుంటున్నారని విమర్శించారు.
ఇదే విషయమై యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనానికే పని చేస్తున్నా ఇతర సదుపాయాలు కూడా సంస్థ కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. దీంతో ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవిస్తున్నామని వాపోయారు. జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో పాటు పాత బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ప్రస్తుతం అవి చెల్లించడం లేదని వివరించారు. ఆగష్టు 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment