బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ధర్నా
ప్రత్యేక సెల్ టవర్ కంపెనీ ఏర్పాటు నిర్ణయంపై...
శ్రీకాకుళం అర్బన్ : భారత సంచార నిగమ్ లిమిటెడ్ సంస్థలో ప్రత్యేక సెల్ టవర్ కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఫోరమ్ ఆఫ్ బీఎస్‌ఎన్‌ఎల్ అసోసియేషన్ జిల్లా శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రత్యేక సెల్ టవర్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆలిండియా ఫోరం ఆఫ్ బీఎస్‌ఎన్‌ఎల్ యూనియన్ దేశవ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళంలోని సంచార భవన్ వద్ద శుక్రవారం ధర్నా చేశా రు. ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ మాతల గోవర్ధనరావు మాట్లాడుతూ ఇప్పటికే రూ.40వేల కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థను మరింత నష్టాల్లోకి నెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.
సంస్థ నిధుల కొరత కారణంగా తగినన్ని సెల్ టవర్స్ లేని కారణంగా సంస్థ వినియోగదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రత్యేక సెల్ టవర్స్ కంపెనీ ఏర్పాటు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేటీకరణకు దారి తీస్తుం దన్నారు. సంస్థ పరిరక్షణకు ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకుంటే డిసెంబరు 15న ఒక రోజు దేశ వ్యాప్త సమ్మె చేయనున్నామని హెచ్చరించారు. ధర్నాలో ఫోరం ఆఫ్ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతినిధులు పి.వెంకటరావు, వెలమల శ్రీనివాసరావు, రాజశేఖర్, లక్ష్మణరావు, ఎం.రమేష్, ఎం.ఎస్.కిరణ్‌కుమార్, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు.