ఏడో స్థాయి సంఘ సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, సీఈవో నాగార్జునసాగర్
♦ స్టాండింగ్ కమిటీ సమావేశాల తీరిది
♦ హాజరుకాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు
కొరిటెపాడు(గుంటూరు) : జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు గురువారం మొక్కుబడి తంతుగా మారాయి. ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ఓ ఎమ్మెల్యే మినహా మిగిలిన వారెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో కోరం కోసం పాట్లు పడ్డారు. జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన గురువారం జరిగింది.
జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు అధ్యక్షతన మూడో స్థాయి సంఘ సమావేశానికి చివరి నిమిషంలో రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. తెనాలి జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మీ మాట్లాడుతూ అమృత హస్తం అభాసుపాలవుతోందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య మాట్లాడుతూ మంగళగిరి ప్రాంత గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని, అంగన్‌వాడీ సెంటర్లలో ఐదారు మందికి మించి పిల్లలు లేరని చెప్పారు.
పంటలకు నీళ్లివ్వరా ?
దాచేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఎం.ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కెనాల్స్ ఆధునికీకరణ పనులు సరిగా లేవని, నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరొస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పొలాలకు నీరిచ్చే పరిస్థితి లేకపోవటం బాధాకరమన్నారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. మండలస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లలో సమన్వయ లోపం ఉందని తెలిపారు. 2016–17 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యంలో 30 శాతం కూడా గృహ నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి పంచాయతీ భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, యజమానులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. పల్నాడు ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యతోపాటు అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు రాయితీ రుణాలు ముందుకు కదలడం లేదన్నారు. సాగు, తాగునీరు, వైరల్ ఫీవర్లు, విద్యాశాఖలో నెలకొన్న నిర్లిప్తత, పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య తూతూ మంత్రంగా చర్చ జరిగింది. ఒక వైపు జ్వరాలు... మరోవైపు నీటి ఎద్దడి... ప్రస్తుతం వైరల్ ఫీవర్లు జిల్లాను వణికించేస్తున్నాయి. సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయి అధికారులు మాత్రమే రావడం గమనార్హం. సమావేశంలో జెడ్పీ సీఈవో బి.నాగార్జునసాగర్, వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.