నేరంగా చూడొద్దు
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల పెంపుపై సీఎం కేసీఆర్
- జాతి నిర్మాణంలో చట్టసభల సభ్యుల పాత్ర కీలకం
- జీతాలు పెంచుకుంటే ప్రజాధనాన్ని తింటున్నట్లుగా భావించొద్దని వ్యాఖ్య
- సభ్యుల జీతాల పెంపు బిల్లుకు సభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: జాతి నిర్మాణంలో చట్టసభల సభ్యుల పాత్ర కీలకమైందని, అలాంటి వారి జీతాల పెంపును నేరంగా చూడడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎన్నో ఖర్చులుంటాయని, వాటి కోసం అప్పులు చేసేవారూ ఉన్నారని చెప్పారు. అందుకే చట్టసభల సభ్యు ల జీతాలు పెంచాలని నిర్ణయించామని... దీనిని విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలను పెంచుతూ.. ‘తెలంగాణ జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొల గింపు సవరణ బిల్లు’కు మంగళవారం శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ అంశంపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజాధనాన్ని దోచుకుంటున్న తరహాలో కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచారని, తమకూ పెరగకపోతే ఎలాగని పేర్కొన్నారు. మాజీ సభ్యుల పింఛన్‌ను మరింత పెంచాలని, వాహన రుణం పరిమితి, ఇంటి అద్దెభత్యాన్ని కూడా పెంచాలని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. సభ్యుల జీతాల పెంపుపై వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. పాత్రికేయులు, పత్రికల అధిపతులు కూడా వాటిని గుర్తించాలని, వ్యతిరేకంగా స్పందించడం మానుకోవాలని సూచించారు.
భారం తక్కువే..
గతంలో ఎంపీల జీతాలు పెంచినప్పుడు టీవీ చర్చల్లో దారుణంగా మాట్లాడారని, వాటిని వింటే బాధ కలిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెంపు ద్వారా అదనంగా పడే భారం రూ.42 కోట్లని, మొత్తం బడ్జెట్ కేటాయింపుతో పోల్చేంత మొత్తం కాదని స్పష్టం చేశారు. ‘‘జాతి నిర్మాణంలో చట్టసభల సభ్యుల పాత్ర చాలా కీలకమైంది. అవినీతిరహితంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండేవాడిని. అప్పుడు నాకు చెల్లించే మొత్తం రూ.500. అందులో నీటి బిల్లు కోసం రూ.110 మినహాయించి రూ.390 చేతికి ఇచ్చేవారు.
అప్పటి సీఎం ఎన్టీఆర్ ఓసారి గండిపేటలో సమావేశం పెట్టినప్పుడు నేను మౌనంగా కూర్చున్నా. ‘బ్రదర్ మౌనమెందుకు.. మాట్లాడు’ అని ఆయన అన్నారు. నేను మాట్లాడితే ఇబ్బందిగా అనిపిస్తుందేమోనని అంటూనే ఎమ్మెల్యేల బాధలపై మాట్లాడిన. నా నియోజకవర్గ కేంద్రం సిద్దిపేట, జిల్లా కేంద్రం సంగారెడ్డి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అన్నీ దూరంగా ఉన్నవే. ఓ ఎమ్మెల్యే 150కిపైగా కమిటీల్లో సభ్యుడిగా ఉంటాడు, 30 వరకు ప్రభుత్వపర సమావేశాలకు హాజరుకావాలి. అసెంబ్లీ, ఇతర అవసరాలకు హైదరాబాద్ చుట్టూ తిరగాలి. నిత్యం సందర్శకులు, ఆరోగ్య సమస్యలతో వచ్చేవారు ఉంటూనే ఉంటారు. ఆసుపత్రి బిల్లుల కోసం సాయం అడిగితే... దగ్గర డబ్బుల్లేక అప్పు చేసి ఇచ్చే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఎమ్మెల్యేల దగ్గర బాగా డబ్బు ఉందనుకుంటారు. మొదట్లో నా కారును ఆరు నెలలు నేనే నడిపా, ఏదో టెన్షన్‌లో ఉంటం.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా? డ్రైవర్‌ను పెట్టుకోవాలి, సెక్యూరిటీ సిబ్బంది ఉంటరు. ఇలా ఖర్చులెన్నో. ఇలాంటప్పుడు జీతం పెంచితే నేరంగా, ప్రజాధనాన్ని తింటున్నట్టు అనుకోవడం సరికాదు..’’ అని కేసీఆర్ చెప్పారు. పలువురు సభ్యులు మరిన్ని సూచనలు చేశారని, వాటిపై తదుపరి సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు
తమ పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు పలువురు మాజీ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు చెప్పారు. మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్యే మాలం మల్లేశం తదితరులు మంగళవారం శాసనసభకు వచ్చి సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు మా పొట్టగొట్టారు
అసెంబ్లీ లాబీలో విలేకరులను కలసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వేతనాలు పెరిగాయి కదాని విలేకరులు ప్రస్తావించగా... ‘‘చంద్రబాబు మా పొట్టగొట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు కనీసం రూ.3.50 లక్షల వరకు పెరుగుతుందని అంతా ఆశించారు. కానీ ఏపీలో అక్కడి సీఎం చంద్రబాబు కేవలం రూ. 2 లక్షల వరకే వేతనాలు పెంచాలని నిర్ణయించడంతో ఇక్కడ రూ.2.30 లక్షలతో ఆపేశారు..’’ అని పేర్కొన్నారు.
రెండేళ్లుగా కోరుతున్నారు: హరీశ్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈసారి వేతనాలు పెంచకుంటే తీవ్ర నిరాశ చెందేవారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వేతనాల పెంపు కోసం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గత రెండేళ్లుగా లేఖలు ఇస్తున్నారని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ‘‘రెండేళ్లుగా అంతా కలుస్తున్నారు. వేతనాలు పెంచుతారా లేదా అని అడిగారు. ఓ ఎమ్మెల్యేకు ఉండే ఖర్చులపై సీఎం కేసీఆర్ ఇచ్చిన వివరణతో బయట కూడా ఏదో అడ్డగోలుగా వేతనాలు పెంచామన్న అభిప్రాయం లేకుండా అయింది..’’ అని పేర్కొన్నారు.