సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో అనూహ్య పరిణామం నెలకొంది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దినకరన్ వర్గ ఎమ్మెల్యే ఒకరు.. ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. రెబల్ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ...‘న్యాయస్థానంపై నమ్మకం పోయింది. న్యాయం చేకూరుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. అందుకే పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. దీంతో దినకరన్ వర్గంలో చీలిక మొదలైందన్న కథనాలు మీడియాలో ప్రారంభం అయ్యాయి.
అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్ ధన్‌పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారిలో అండిపట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ కూడా ఒకరు. ఉప ఎన్నికలకు వెళ్లినా గెలుపు తనదే అన్న ధీమాలో ఆయన ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు.
అయితే గ్రూప్‌లో చీలిక ప్రచారాన్ని దినకరన్ మాత్రం కొట్టిపారేశారు. ‘పిటిషన్ విషయంలో తంగతమిళ్‌సెల్వన్ అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. అయినా ఆయన మా వెంటే ఉన్నారు. మా వర్గం అంతా ఐక్యంగానే ఉంది. అంతా ఓకే’ ఆయన కాసేపటి క్రితం ప్రకటించారు. ఒకవేళ కేసులో హైకోర్టు తీర్పు అనుకూలంగా లేకపోతే మాత్రం.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దినకరన్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే తమిళనాడులో దినకనర్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం... గురువారం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తీర్పుపై అనిశ్చితి నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించింది.
Comments
Please login to add a commentAdd a comment