Rebel Mla
-
Maharashtra Political Crisis: ముదురు పాకాన...
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి సారథి శివసేనలో ఇంటి పోరు మరింత ముదురుతోంది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో రాష్ట్రంలో మంగళవారం మొదలైన రాజకీయ సంక్షోభం నానా మలుపులు తిరుగుతోంది. షిండే సారథ్యంలో నాలుగు రోజులుగా అసోంలోని గౌహతిలో హోటల్లో మకాం చేసిన 40 మందికి పైగా సేన రెబల్ ఎమ్మెల్యేలు తమది శివసేన (బాలాసాహెబ్) వర్గమని ప్రకటించుకున్నారు. తామేమీ పార్టీని వీడటం లేదని, షిండే సూచించిన మేరకు తమ వర్గానికి ఓ పేరు మాత్రం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. సభలోనూ అదే పేరిట కొనసాగుతామనే సంకేతాలిచ్చారు. రెబల్స్ తరఫున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ శనివారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్ధవ్‌పై తమకేమీ వ్యతిరేకత లేదన్నారు. ‘‘కానీ 55 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో ఆయన వైపున్న వారి సంఖ్య 15 కంటే తక్కువకు పడిపోయింది. మూడింట రెండొంతుల మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో గళమెత్తుతున్నామంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఆయనే అర్థం చేసుకోవాలి. పార్టీని హైజాక్ చేసింది మేం కాదు, అధికార కూటమి భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్. వాటి బారినుంచి పార్టీని కాపాడుకోవడమే మా ఉద్దేశం’’ అన్నారు. ఉద్ధవ్ ఇప్పటికైనా ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పి బీజేపీతో చేతులు కలపాలని డిమాండ్ చేశారు. పార్టీకి మద్దతు ఉపసంహరిస్తారా అని ప్రశ్నించగా తమదే అసలైన శివసేన అని చెప్పుకొచ్చారు. ‘‘ఈ ఒత్తిళ్లలో ముంబై తిరిగి రావడం క్షేమం కాదు. సరైన సమయంలో తిరిగొస్తాం’’ అని ప్రకటించారు. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండేను గుర్తించాలన్న తమ లేఖను డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని ఖండించారు. ‘‘ప్రభుత్వానే ఉద్ధవ్ నెలల తరబడి ఆన్లైన్ మీటింగులతో నడిపిస్తున్నారు. కనుక డిప్యూటీ స్పీకర్‌నూ ఆన్లైన్ మీటింగ్ పెట్టమనండి. మా బలం నిరూపించుకుంటాం’’ అని సవాలు చేశారు. జూన్ 30 దాకా వాళ్లు గౌహతి హోటల్లోనే ఉంటారని సమాచారం. సంకీర్ణ కొండచిలువ విషకౌగిలి నుంచి శివసైనికులను విముక్తులను చేసేందుకే పోరాడుతున్నానంటూ శనివారం రాత్రి పొద్దుపోయాక షిండే ట్వీట్ చేశారు. శివసేన కార్యకర్తలంతా దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఆయన శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని వడోదర వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినట్టు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు అందులో పాల్గొన్నట్టు చెబుతున్నారు. ముంబైలో 144 సెక్షన్ మరోవైపు ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన జాతీయ కార్యవర్గ భేటీ జరిగింది. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారాన్ని సభ్యులంతా ఉద్ధవ్‌కు కట్టబెట్టారు. శివసేన, బాలాసాహెబ్ ఠాక్రే పేరు ఎవరూ వాడుకోవడానికి వీల్లేదంటూ తీర్మానం చేశారు. శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఉద్ధవ్‌కు సంఘీభావం ప్రకటించారు. శివ సైనికులను వీధుల్లోకి వదులుతామంటూ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటన చేశారు. దమ్ముంటే ముంబై వచ్చి పార్టీని ఎదుర్కోవాలని షిండేకు సవాలు విసిరారు. సత్యాసత్యాల మధ్య పోరాటంలో గెలుపు తమదేనని ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే అన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలువురు రెబల్ ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల వద్ద భారీ నిరసనలకు, దాడులకు దిగారు. పలువురి కార్యాలయాలను ధ్వంసం చేశారు. తనతో పాటున్న 38 మంది రెబల్ ఎమ్మెల్యేల కుటుంబాలకు పోలీసులు కావాలనే భద్రత ఉపసంహరించారని షిండే ఆరోపించారు. వీటిని హోంమంత్రి దిలీప్ వాస్లే పాటిల్ ఖండించారు. ఉద్రిక్తత నేపథ్యంలో ముంబైలో జూలై 10 దాకా 144 సెక్షన్ విధించారు. ఉద్ధవ్ ఫిర్యాదు మేరకు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు పంపారు. సోమవారం సాయంత్రంలోగా స్పందించాలని ఆదేశించారు. -
బస్సుల గోల.. కాంగ్రెస్‌పై అదితి ఫైర్
లక్నో : కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్ మరోసారి సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీకి చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బస్సుల్లో చాలా వరకు చిన్న వాహనాలే ఉన్నాయని విమర్శించారు. మరోవైపు వలస కార్మికుల తరలింపునకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. ఈ మేరకు ఆమె పలు ట్వీట్లు చేశారు. ఇలాంటి విపత్తు సమయాల్లో దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముందుని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పంపిన బస్సుల్లో సగానికిపైగా బస్సులు రిజిస్ట్రేషన్ నంబర్లు ఫేక్ అని ఆరోపించారు. కొన్ని వాహనాలకు ఎలాంటి పేపర్లు కూడా లేవన్నారు. (చదవండి : ప్రియాంక గాంధీ అభ్యర్థన మన్నించిన యూపీ ప్రభుత్వం) ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వద్ద బస్సులు ఉంటే పంజాబ్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పిల్లలు రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయినప్పుడు ఈ బస్సులు ఎక్కడున్నాయని నిలదీశారు. రాజస్తాన్ ప్రభుత్వం వారిని సస్థలాలకు పంపడానికి ఎలాంటి ఏర్పాటు చేయలేదని.. కనీసం బోర్డర్ వరకు కూడా తరలించలేదని విమర్శించారు. వారిని బస్సుల్లో స్వస్థలాలకు తీసుకురావడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమించారని తెలిపారు. రాజస్థాన్ సీఎం కూడా ఆదిత్యనాథ్ కృషిని ప్రశంసించారని చెప్పారు. కాగా, నోయిడా, ఘాజియాబాద్ సరిహద్దులో నిలిచిపోయిన యూపీకి చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 1,000 బస్సులను నడపడానికి యోగీ ప్రభుత్వాన్ని అనుమతి కోరిన సంగతి తెలిసిందే. ప్రియాంక విజ్ఞప్తిపై స్పందించిన యూపీ సర్కార్.. ఆ బస్సులకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పంపిన బస్సుల్లో చాలా వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు తప్పుగా ఉన్నాయని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వీటి రిజిస్ట్రేషన్ నెంబర్లలో చాలావరకు ఆటోలు, టూ వీలర్లు, గూడ్స్ క్యారియర్ల రిజిస్ట్రేషన్ నెంబర్లని ఆరోపించారు. ఇందుకు సంబంధించి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లు, ప్రియాంక గాంధీ సెక్రటరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అదితి సింగ్.. కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు : విశ్వాస పరీక్ష ముగిసినా కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 48 గంటల్లోనే కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గురువారం అనర్హత వేటు వేశారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్.శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్జ్‌హోళి, మహేష్... 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటన చేశారు. విశ్వాస తీర్మానంలో కుమారస్వామి ప్రభుత్వానికి వీరంతా మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ కేపీజేపీ (కర్ణాటక ప్రజకీయ జనతా పార్టీ) తరపును పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఈ ఏడాది జూన్ 14న గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. అంతేకాకుండా కేపీజేపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. విలీన ప్రక్రియకు స్పీకర్ ఈ ఏడాది జూన్ 25న ఆమోదం తెలపడంతో ఆర్.శంకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణించడం జరిగింది. కాగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ బీజేపీలోకి చేరేందుకు సన్నద్ధం అయ్యారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. 17 రోజులు హైడ్రామా కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పనితీరుకు వ్యతిరేకంగా రెండు పార్టీల నుంచి 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. అయితే ఎవరు ఎందుకు రాజీనామా చేశారనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. రాజీనామా చేసిన 16మందిలో 12మంది ముంబయిలో మకాం వేశారు. పార్టీ అధిష్టానం విప్ జారీ చేసినప్పటికీ పట్టించుకోలేదు. ముంబయికి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ జాతీయ నేతలు గులాంనబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్ వెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయింది. -
అనర్హత వేటు కేసు.. అనూహ్య పరిణామం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో అనూహ్య పరిణామం నెలకొంది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దినకరన్ వర్గ ఎమ్మెల్యే ఒకరు.. ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. రెబల్ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ...‘న్యాయస్థానంపై నమ్మకం పోయింది. న్యాయం చేకూరుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. అందుకే పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. దీంతో దినకరన్ వర్గంలో చీలిక మొదలైందన్న కథనాలు మీడియాలో ప్రారంభం అయ్యాయి. అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్ ధన్పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారిలో అండిపట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ కూడా ఒకరు. ఉప ఎన్నికలకు వెళ్లినా గెలుపు తనదే అన్న ధీమాలో ఆయన ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. అయితే గ్రూప్‌లో చీలిక ప్రచారాన్ని దినకరన్ మాత్రం కొట్టిపారేశారు. ‘పిటిషన్ విషయంలో తంగతమిళ్‌సెల్వన్ అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. అయినా ఆయన మా వెంటే ఉన్నారు. మా వర్గం అంతా ఐక్యంగానే ఉంది. అంతా ఓకే’ ఆయన కాసేపటి క్రితం ప్రకటించారు. ఒకవేళ కేసులో హైకోర్టు తీర్పు అనుకూలంగా లేకపోతే మాత్రం.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దినకరన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడులో దినకనర్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం... గురువారం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తీర్పుపై అనిశ్చితి నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించింది. -
‘ఆయనలాంటి స్నేహితులు బీజేపీకి అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తోందని వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆప్ అసంతృప్త ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రాను ఉద్దేశించి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కపిల్ మిశ్రా వంటి స్నేహితుడి అవసరం బీజేపీకి ఉంది. ఆయన కోసం బీజేపీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకునే ఉంటాయని’ గోయల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..‘ఆప్ నేతలతో విభేదాలు వచ్చినప్పటి నుంచి మేము ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాం. అయితే బీజేపీలో చేరాలా వద్దా అన్నదానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని’ గోయల్ పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మే 30న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించిన ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్ధతు కోరే కార్యక్రమం)లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న గోయల్.. కపిల్ మిశ్రాపై ప్రశంసలు కురిపించారు. ‘పాజిటివ్ ఆటిట్యూడ్‌కు కపిల్ మిశ్రా ఒక ప్రతీక లాంటివారు. సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం అమోఘం’ అంటూ గోయల్ ప్రశంసించారు. కాగా తూర్పు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన కపిల్ మిశ్రా తల్లి అన్నపూర్ణ మిశ్రా బీజేపీ సీనియర్ నేతగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మిశ్రా పలుమార్లు విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
రెబల్ ఎమ్మెల్యేలపై వీడని ఉత్కంఠ
ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలపరీక్షలో పాల్గొనడంపై రేపు హైకోర్టు తీర్పు డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అనర్హత వేటుపడిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనడంపై ఉత్కంఠ వీడలేదు. దీనిపై తీర్పును సోమవారం (ఈనెల 9) వరకు హైకోర్టు రిజర్వులో ఉంచింది. ఈనెల 10న పదవీచ్యుత సీఎం రావత్ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. అయితే రెబల్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనాలో, లేదో అనేది హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో శనివారం హైకోర్టులో జస్టిస్ యూసీ ధ్యానీ 3గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్నారు. ఈనెల 9న ఉదయం 10.15 గంటలకు తీర్పు ప్రకటిస్తాననని అని జస్టిస్ ధ్యానీ చెప్పారు. రెబల్స్ లాయర్ సి.అరియమ వాదనలు వినిస్తూ.. అసెంబ్లీ స్పీకర్ చర్య సహజ న్యాయానికి విరుద్ధమన్నారు. ఒకవేళ ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొంది ఉంటే రెబల్స్, బీజేపీతో కలసి ఓటేశారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన లాయర్లు కపిల్ సిబల్, అమిత్ సిబల్ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ ఎదుట బలప్రదర్శన చేశారని, ఇది పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుందన్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 10 నాటి బలపరీక్ష నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌లు జారీచేసే పనిలో కాంగ్రెస్, బీజేపీ నిమగ్నమయ్యాయి. -
‘పచ్చ’జెండా మోసినోళ్లపై కక్ష
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ రెబెల్‌గా బరిలో దిగి ఘన విజయం సాధించిన ఎస్వీఎస్ఎన్ వర్మ తిరిగి ఆ పార్టీ గూటికే చేరిపోయారు. అయితే.. అటు అధిష్టానమూ బాగానే ఉంది, ఇటు తిరిగి పార్టీ పంచకు వచ్చిన వర్మా బాగానే ఉన్నారు.. ‘ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసం ఒళ్లొంచి కష్టించిన’ తమకే కష్టకాలం వచ్చిపడిందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. నాడు తనకు కాక పార్టీ అభ్యర్థి కోసం పని చేసినందున ఎమ్మెల్యే వర్మ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రమంతటా ఉన్న తెలుగుదేశం పార్టీ ఉందా లేక ఎమ్మెల్యే వర్మ మార్కు టీడీపీయే ఉందా అని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు పెద్దపీట వేయాలని అధినేత చంద్రబాబు పార్టీ వేదికలపై గంభీరోపన్యాసాలు ఇస్తున్నారు. కానీ పిఠాపురం టీడీపీలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పిఠాపురంలో ‘రెబెల్’ వర్మకు వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వం కోసం పని చేయడమే అక్కడి కార్యకర్తలు, నాయకులు చేసిన తప్పు అన్నట్టు వర్మ, ఆయన అనుచర వర్గం వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు టిక్కెట్టు ఇవ్వనందుకు పలువురు టీడీపీ కార్యాలయం సాక్షిగా బాబు దిష్టిబొమ్మను దహనం చేసి, పార్టీ జెండాలను కూడా తగలబెట్టారు. పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు.ఈ నిరసన కార్యక్రమాలకు వెన్నంటి నిలిచిన వారే ఇప్పుడు అంతా తామే అన్నట్టు పార్టీలో హవా కొనసాగిస్తున్నారు. పార్టీ కోసం పని చేసి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన పిఠాపురం టౌన్ టీడీపీ ప్రెసిడెంట్, కౌన్సిలర్ రెడ్నం భాస్కరరావు, యు.కొత్తపల్లి వైస్ ఎంపీపీ అనిశెట్టి సత్యానందరెడ్డి, గొల్లప్రోలు రూరల్ పార్టీ అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబులు పార్టీలో పెత్తనం చలాయిస్తుండటంపై నిప్పులు చెరుగుతున్నారు. నాడు అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి విశ్వం కోసం పనిచేసిన నాయకులను శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని వర్మ అనుచరవర్గం బహిరంగంగానే చెబుతోంది. చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పెద్దల మాట కూడా పట్టించుకోకుండా వర్మ తన వర్గాన్ని ఎగదోస్తున్నారని వ్యతిరేక వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. అల్లుమల్లుపై అవిశ్వాసానికి రంగం సిద్ధం.. కాగా పార్టీ కోసం పనిచేసినందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి మొర ఆలకించే వారు లేరని కేడర్ ఆవేదన చెందుతోంది. పోతుల విశ్వంకు వరుసకు సోదరుడైన రాంబాబు అదే రకంగా వర్మ వర్గం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిఠాపురం టౌన్షిప్లో విశ్వం ఎన్నికల క్యాంప్ నిర్వహణకు ఆశ్రయం ఇవ్వడమే ఆయన నేరమైంది. లే అవుట్ పక్కన స్థానికుల కోరిక మేరకు పుంత రోడ్డును ఆధునికీకరించడంతో రాంబాబు ఎన్నికల అనంతరం నోటీసు అందుకోవాల్సి వచ్చింది. అలాగే జల్లూరు ఎంపీపీ యూపీ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకురాలు ఎస్.వరలక్ష్మి కుమారుడు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. అదే ఇప్పుడు వరలక్ష్మి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ పోవడానికి కారణమైందని తెలుగుతమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. విశ్వం కోసం క్రియాశీలకంగా పనిచేసిన పి.రాయవరం సొసైటీ ప్రెసిడెంట్ అల్లుమల్లు విజయకుమార్‌పై వర్మ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నాయకులు మండిపడుతున్నారు. సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయనపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు. 11 మంది సొసైటీ డెరైక్టర్లు కాకినాడలో జిల్లా సహకార అధికారికి అవిశ్వాసం తీర్మానం కోసం సోమవారం లేఖ ఇవ్వడం, ఈ నెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో వివాదం ముదురుతోంది. ఎమ్మెల్యే హస్తం లేకుండా ఇదంతా జరగదని, ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి ఇప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్న నాయకులు జిల్లా ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు. ఇండిపెండెంట్‌గా గెలుపొంది తిరిగి సొంత గూటికి చేరిన వర్మ మరింత హుందాగా వ్యవహరించాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలను ప్రోత్సహిస్తే పార్టీకి చేటని పార్టీశ్రేణులు అంటున్నారు. పార్టీ పెద్దలుగా చలామణీ అయ్యే జిల్లా నేతలు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.