సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తోందని వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆప్ అసంతృప్త ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రాను ఉద్దేశించి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘కపిల్ మిశ్రా వంటి స్నేహితుడి అవసరం బీజేపీకి ఉంది. ఆయన కోసం బీజేపీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకునే ఉంటాయని’ గోయల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..‘ఆప్ నేతలతో విభేదాలు వచ్చినప్పటి నుంచి మేము ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాం. అయితే బీజేపీలో చేరాలా వద్దా అన్నదానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని’ గోయల్ పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మే 30న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించిన ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్ధతు కోరే కార్యక్రమం)లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న గోయల్.. కపిల్ మిశ్రాపై ప్రశంసలు కురిపించారు. ‘పాజిటివ్ ఆటిట్యూడ్‌కు కపిల్ మిశ్రా ఒక ప్రతీక లాంటివారు. సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం అమోఘం’ అంటూ గోయల్ ప్రశంసించారు. కాగా తూర్పు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన కపిల్ మిశ్రా తల్లి అన్నపూర్ణ మిశ్రా బీజేపీ సీనియర్ నేతగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.
కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మిశ్రా పలుమార్లు విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment