నిజమైతే.. నేను జైల్లో ఉండేవాడ్ని: సీఎం
మాజీ మంత్రి కపిల్ మిశ్రా తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఇవి నిరాధార ఆరోపణలని, వీటిని ప్రత్యర్థులు సైతం నమ్మడం లేదని పేర్కొన్నారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం పస ఉన్నా తాను ఈపాటికి జైలులో ఉండేవాడినని ఆయన అన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. మాజీ ఆప్ నేత, తన కేబినెట్‌లో మాజీ మంత్రి అయిన కపిల్ మిశ్రా ఆరోపణలపై తొలిసారి మౌనాన్ని వీడారు. తాను ఏ చిన్న కుంభకోణానికి పాల్పడినా కేంద్రంలోని బీజేపీ తనను జైలులో వేసేదని పేర్కొన్నారు.
ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ. రెండుకోట్లు కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని, పార్టీ విరాళాలు, నిధుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని కపిల్ మిశ్రా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని, తాను రూ. 2 కోట్ల లంచం తీసుకోలేదని కేజ్రీవాల్ తెలిపారు.