ఇసుక లొల్లి | sand shortage for Double bedroom cunstrustions MLAs concerned | Sakshi
Sakshi News home page

ఇసుక లొల్లి

Published Sun, Feb 26 2017 2:32 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

ఇసుక లొల్లి - Sakshi

ఇసుక లొల్లి

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి
ఇసుక కొరతపై ఎమ్మెల్యేల ఆందోళన

ప్రభుత్వ పనులు నిలిచి  పోతున్నాయంటూ ఆవేదన
నియోజకవర్గాలకు దగ్గరలో క్వారీలు తెరిపించాలని పట్టు
పెద్దపల్లి తరహాలో ఇసుక పాలసీని అమలు చేయాలని సూచన
కలెక్టర్‌కు, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అసంతృప్తి
నిబంధనలు సడలించి క్వారీలు తెరిపిస్తామని మంత్రి పోచారం హామీ
ప్రగతిభవన్‌లో డబుల్‌ బెడ్‌ రూం  ఇళ్ల నిర్మాణంపై వాడివేడిగా సమీక్ష


ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) :
ఇద్దరు మంత్రుల సాక్షిగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఇసుక కొరతపై వాగ్వాదానికి దిగారు. కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో శనివారం మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇళ్ల నిర్మాణానికి ప్రధాన కొరత ఇసుకనే అంటూ.. ఎమ్మెల్యేలు వాదనలకు దిగారు. కలెక్టర్‌ను కూడా ప్రశ్నించారు. ఇసుక లేక తన నియోజకవర్గంలో వందల సంఖ్యలో జరుగుతున్న ప్రభుత్వ పనులు జరగడం లేదని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌.. ఇటు తన నియోజకవర్గంలో ఒక్క క్వారీకి కూడా అనుమతి ఇవ్వకపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి ఇబ్బందులు పడుతూ ఇసుకను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగైతే ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు   ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు.

కలెక్టర్‌పై ఎమ్మెల్యేల ఫైర్‌
సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ను ప్రశ్నిస్తూనే ఎమ్మెల్యేలు వాదనకు దిగారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని గుర్తించడంలో కలెక్టర్‌కు అవగాహన లేదని ఆర్మూర్‌ ఎమ్మెల్యే నేరుగా వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా జిల్లాకు వచ్చి అంకాపూర్‌లో 165 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి చాలా రోజులు అవుతున్నా.. నేటి వరకు అక్కడ స్థలం చూపడంలో రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌ నిర్లక్ష్యంగా వహించారని ఆరోపించారు. ఇసుక కొరత విషయంలో క్వారీలకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్, జేసీలకు లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు.

పెద్దపల్లి కలెక్టర్‌ తరహాలో జిల్లాలో ఇసుక పాలసీని అమలు చేయాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అదే విధంగా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని నవీపేట్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు మొత్తం రాళ్లు, కొండలు ఉన్నవి కూడా చూడకుండా స్థలాన్ని ఎంపిక చేశారని, అక్కడ ఇళ్లు నిర్మించడం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. అలాగే ఇసుక కొరత వల్ల పనులు నిలిచిపోవడమే కాకుండా, పనులు ముందుకు జరగకపోవడం కారణంతో అధికారులు సస్పెండ్‌కు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ పనులు జరగకుండా ఇసుకను అడ్డుకుంటున్న వారిపై ఎఫ్‌ఐఆర్‌ కేసులు పెట్టించాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో పనులు జరగకపోవడం మూలంగా ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని, ఓ క్రమంలో జిల్లాలో తమకు ఎవ్వరూ సహకరించడం లేదని, మీరే దిక్కని మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఇరువురు ఎమ్మెల్యేలు విన్నవించారు.

ఎమ్మెల్యేలను వారించిన మంత్రి పోచారం
ఈ క్రమంలో స్పందించిన మంత్రి పోచారం ఇద్దరు ఎమ్మెల్యేలను వారిస్తూనే శాంతింప చేసే ప్రయత్నం చేశారు. జిల్లాలో ఏర్పడిన ఇసుక కొరతను అధిగమించడానికి, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడానికి ఇసుక నిబంధనలను సడలించి  క్వారీలు తెరవడానికి సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గాలకు దగ్గరలో క్వారీలకు అనుగుణంగా ఉన్న వాటి వివరాలను అందజేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలకు ట్రాక్టర్‌లతో కాకుండా మిషనరీతో తవ్వించి టిప్పర్‌లలో ఇసుకను రవాణా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే పెద్దపల్లి కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయం తరహాలో జిల్లాలో కూడా ఇసుక పాలసీని అమలు చేయడానికి ఆలోచించాల్సి ఉంటుందన్నారు.

ఇసుక కొరత వల్ల ప్రభుత్వ పనులు జరగడం లేదన్న విషయంపై అదనంగా క్వారీలు తెరిచినందుకు ఇష్టారాజ్యంగా ఇసుకను కమర్షియల్‌గా వాహనాల్లో ఇరత వాటికి ఉపయోగిస్తే కఠికంగా వ్యవహరిస్తామని, కేసులు పెట్టి జైల్‌లో తోస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పనుల కోసం తవ్వుతున్న ఇసుక కాబట్టి సీనరేజీ నిధులను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదారు రాజు, హౌసింగ్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్ర రామచంద్రన్, నగర మేయర్‌ ఆకుల సుజాత, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా, జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్, డీఆర్వో పద్మాకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

‘డబుల్‌’ స్పీడ్‌తో ముందుకెళ్తాం..
– పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

దేశంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకాన్ని చేపట్టిందని మంత్రి అన్నారు. 2015–16 సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలకు కలిపి 7,660 ఇళ్లు మంజూరు కాగా, నిజామాబాద్‌ జిల్లాకు 4,990, కామారెడ్డికి 2,670 మంజూరైనట్లు తెలిపారు. అయితే ఇళ్ల నిర్మాణానికి ఇరు జిల్లాల్లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచామన్నారు. ఒక్కో ఇల్లును రూ.5.40 లక్షలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇళ్లు నిర్మిస్తున్న పై రెండు శాఖలకు రోడ్లు, భవనాలు, ఇతర పనులకు కూడా టెండర్లు చాలా ఉన్నాయని, మొత్తం రూ.1,650 కోట్ల పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

డబుల్‌ బెడ్‌రూంలు పూర్తి చేస్తాం..
– హౌసింగ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ని ర్మాణాలను సకాలంలో పూర్తి చేసి ఇస్తామని హౌసింగ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మొత్తం 2 లక్షల70 వేలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చే సిందని, ఇందులో లక్ష ఇళ్లు హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీకి, లక్షా70 వేల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలవారికి కేటాయించినట్లు తెలిపారు. చాలా జిల్లాల్లో టెండర్లు నిర్వహించినా కాంట్రాక్టర్లు నిర్మాణానికి ముందుకు రాకపోవడంతో ఆలస్యం జరిగిందన్నారు. ప్రస్తుతం టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారమే అనుమతి
– డాక్టర్‌ యోగితారాణా, కలెక్టర్‌

నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీలకు అనుమ తి ఇస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఇసుక క్వారీలుండాలో కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించి మైన్స్‌ శాఖ ఆధ్వర్యంలో అనుమతి ఇచ్చామన్నారు. ప్రజాప్రతినిధులు క్వారీలు కావాలని లేఖ ద్వారా కోరిన సమయాల్లో మైన్స్‌ అధికారులతో సర్వే చేయిస్తున్నాం. నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే అనుమతి ఇస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతి ఇవ్వడం లేదు. అలాగే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ విషయంలో స్థలాల గు ర్తింపు దాదాపు పూర్తయిందని, త్వరలోనే పను లు ప్రారంభించనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement