
ఎమ్మెల్యేలు వివిధ బోర్డుల అధ్యక్షులు. కేబినెట్ మంత్రుల హోదా. అందుకు తగ్గట్టుగా జీత, భత్యాలతో పాటు అన్ని వసతులనూ పొందుతూనే, మరోవైపు ఎమ్మెల్యేలుగా కూడా జీత, భత్యాలను తీసుకుంటున్నారు. ఇలా రెండు చేతులా జీత, భత్యాలను కైంకర్యం చేస్తూ ఖజానాకు కోట్ల రూపాయల నష్టాన్ని కలగజేస్తున్నారు. ఇలా 21 మంది ఎమ్మెల్యేల బాగోతాన్ని విధానసౌధ సచివాలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. వారి నుంచి ఆ మొత్తాల్ని రాబట్టే ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి, ఈ నెల 22న ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు.
సాక్షి, బెంగళూరు: బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష స్థానంలో ఉన్న వారికి కేబినెట్ హోదాతో పాటు మంత్రులకు ఇచ్చినట్లుగానే ఇంటి అద్దె, ఇంధన భత్యం, వాహన సౌకర్యం, వైద్య పరీక్షల భత్యంతో పాటు ఇంటికి ఫర్నీచర్‌ను కూడా అందజేస్తారు. కాగా, నిగమ మండలి హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి తమకు ఎమ్మెల్యేగా అందే జీత, భత్యాలను తీసుకునేందుకు వీలులేదు. ‘కర్ణాటక విధానమండలి వేతనాలు, నివృత్తి వేతనం, భత్యాల చట్టం– 1956’ ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం. అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కి బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా కూడా జీత, భత్యాలను అందుకుంటున్నారు. వీరందరూ అధికార కాంగ్రెస్‌వారే కావడం విశేషం.
రికవరీకి చర్యలు చేపట్టాం
‘గతంలో చాలామంది ఇదే విధంగా ఒక్కరే రెండు, మూడు జీత, భత్యాలను అందుకునేవారు. అయితే ఇప్పుడు అలా చేసేందుకు సాధ్యం కాదు. ఇలా ఒక్కరే అటు నిగమ మండలి హోదాలో, ఇటు ఎమ్మెల్యే హోదాలో నిబంధనలకు వ్యతిరేకంగా జీత, భత్యాలను తీసుకునేవారిని గుర్తించి, వారి నుండి తీసుకున్న మొత్తాన్ని వసూలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’ అని విధాసౌధ సచివాలయం ఉన్నత స్థాయి అధికారి ఒకరు వెల్లడించారు.
ఆ 21 మంది బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షులు ఎవరంటే...
జి.హంపయ్య నాయక్ – తుంగభద్రా అచ్చుకట్టు అభివృద్ధి మండలి
మాలికయ్య గుత్తేదార్ – కర్ణాటక గృహ మండలి
ఆర్.వి.దేవరాజ్ – కర్ణాటక స్లమ్ అభివృద్ధి మండలి
కె.వెంకటేష్ – బీడీఏ
రాజశేఖర్ బి.పాటిల్ – భూసేనా నిగమ
ఎం.టి.బి.నాగరాజ్ – బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల యోజనా ప్రాధికార
ఫైరోజ్ సే– కర్ణాటక పర్యాటక అభివృద్ధి మండలి
కె.గోపాల పూజారి – కేఎస్‌ఆర్‌టీసీ
సి.పుట్టరంగశెట్టి – కర్ణాటక రోడ్ల అభివృద్ధి మండలి
రహీం ఖాన్ – రాష్ట్ర గోడౌన్‌ల ఏర్పాటు మండలి
కె.వసంత బంగేర – రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి మండలి
బి.ఆర్.యావగల్ – బంగారు గనుల మండలి
ఎం.కె.సోమశేఖర్ – కర్ణాటక పట్టు పరిశ్రమల మండలి
జె.ఎస్.పాటిల్ – కర్ణాటక నవీకరించగల ఇంధన అభివృద్ధి మండలి
శివానంద ఎస్.పాటిల్ – కర్ణాటక నగర నీటి సరఫరా, డ్రైనేజీల మండలి
హంపనగౌడ బాదర్లీ – మైసూరు సేల్స్ ఇంటర్నేషనల్
హెచ్.ఆర్.ఆలగూర – కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్
డి.సుధాకర్ – కియోనిక్స్
బాబూరావ్ చించనసూర్ – కర్ణాటక సరిహద్దు ప్రదేశాభివృద్ధి మండలి
శారదా మోహన్ శెట్టి – కరవావళి ప్రాంత అభివృద్ధి మండలి
ఎస్.వై.గోపాల కృష్ణ – డాక్టర్ డి.ఎం.నంజుండప్ప నివేదికల అమలు మండలి