రాజీనామా గళాన్ని విప్పిన కొంతమంది అసంతృప్తులు
సీఎం సిద్ధును పదవి నుంచి తప్పించాలంటున్న మరికొందరు
అసంతృప్తిని చల్లార్చేందుకు ‘ఆస్కార్’ ప్రయత్నాలు
బెంగళూరు: పాలనను పరుగులు పెట్టించేందుకు సీఎం సిద్ధరామయ్య చేసిన మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణపై నిరసన సెగలు ఇంకా చల్లారడం లేదు. ఇటీవల మంత్రి పదవులను పోగొట్టుకున్న వారితో పాటు ప్రక్షాళనలో చోటు దక్కని ఎమ్మెల్యేలు సైతం సీఎం సిద్ధరామయ్య పై నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వీరంతా కలిసి సీఎంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మంత్రి పదవులను కోల్పోయిన అంబరీష్‌తో పాటు శ్రీనివాస ప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, బాబూరావ్ చించనసూర్‌తో పాటు మంత్రి మండలిలో స్థానాన్ని ఆశించి భంగపడిన మాలకరెడ్డి, ఎస్.టి.సోమశేఖర్
తదితరులు సీఎం సిద్ధరామయ్య పై గుర్రుగా ఉన్నారు. సీఎంను ఆ పదవి నుంచి తప్పిస్తే తప్ప వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. వీరంతా బెంగళూరులోని శ్రీనివాస ప్రసాద్ నివాసంలో బుధవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రెబల్‌స్టార్ అంబరీష్ ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, తాజా మాజీ మంత్రి బాబూరావ్ చించనసూర్ సైతం తన నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రజలతో చర్చించి రాజీనామా పై నిర్ణయం తీసుకుంటానని బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసమ్మతిని చల్లార్చే బాధ్యతలను అధిష్టానం పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండజ్‌కు అప్పగించగా ఆయన బుధవారం మద్యాహ్నం తాజా మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ నివాసానికి చేరుకొని గంటపాటు చర్చించారు. ‘వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం, అందువల్ల మీ సమస్య ఏదైనా సరే దాన్ని పార్టీ వేదికలపై చర్చించండి తప్పితే బహిరంగ వ్యాఖ్యలు చేయకండి’ అని ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్రీనివాస ప్రసాద్‌తో పేర్కొన్నట్లు సమాచారం. అంతకుముందు అసంతృప్త ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులతో చర్చల అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ....‘మంత్రి మండలి పునర్ వ్యస్థీకరణ సరిగా జరగలేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరన జరిపారు.
మంత్రి మండలి నుండి మమ్మల్ని తప్పించే సమయంలో ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం మాకు చాలా బాధ కలిగించింది. ఇప్పట్లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసే ఆలోచన ఏదీ లేదు. కర్ణాటకను కాంగ్రెస్ ముక్త రాష్ట్రంగా కాంగ్రెస్ హైకమాండే మారుస్తుందేమో అనిపిస్తోంది. అయితే అందుకు అవకాశం కల్పించరాదనేదే మా అందరి అభిమతం’ అని పేర్కొన్నారు.