
అసంతృప్తితోనే రాజీనామా
జారకీహోళీ నిర్ణయాన్ని మార్చుకుంటారు
శాఖ మార్పుపై పరిశీలిస్తాం
రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బళ్లారి(కొప్పళ) : తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితోనే మంత్రి పదవికి సతీష్ జారకీహోళీ రాజీనామా చేశారని, త్వరలోనే ఆ నిర్ణయాన్ని ఆయన మార్చుకుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కొప్పళ జిల్లా కుష్టిగిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం విచ్చేసిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. సతీష్ జారకిహొళీతో చర్చలు జరి పామన్నారు. ఆయన ఎలాం టి షరతులు విధించలేదన్నారు. ఆయనతో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో కచ్చితం గా తెలియలేదని, అయితే శాఖల మార్పు విషయమై రాజీనామా చేసి ఉండవచ్చన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన శాఖ మార్పు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ అబద్ధాలకోరని విమర్శించారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడంలో ఆయన మహాదిట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవెగౌడ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు పొందడం వెనుక దేవెగౌడ ఆశీస్సు లు కాదని, అప్పట్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తనను బలపరచడం వల్లనే ఆ పదవులు తనను వరించాయన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఎక్కడైనా మంచి స్థానం దొరుకుతుందన్నారు. గృహనిర్మాణ శాఖా మంత్రి అం బరీష్‌తో తనకు వాగ్వాదం జరిగినట్లుగా మీడియాలో వెలువడిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఇటీవల మీడియాలో ఊహాజనిత వార్తలు, కథనాలు వెలువడుతున్నాయన్నారు. ఆర్కావతి డీ నోటిఫికేషన్ ఉదంతంలో తాను ‘రీడూ’ అనే పదాన్ని ఉపయోగించలేదని, అది హైకోర్టు ఉపయోగించిన పదమని పేర్కొన్నారు.