
దామెర మండల కార్యాలయ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ రద్దు వార్తల నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ నెల 6న అసెంబ్లీని రద్దు చేస్తే బుధవారం చివరి రోజు కావడంతో అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. బుధవారం రాత్రి వరకు పాల్గొని అధికార కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు జోరుగా శంకుస్థాపనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన పలు భవనాలను సైతం ప్రారంభించారు.
రూ.111 కోట్ల పనులకు శంకుస్థాపనలు..
జిల్లాలో పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఒకే రోజు రూ.111.04 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ కార్యకర్తలను సమయాత్తం చేశారు.
పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి బుధవారం ఒక్కరోజే రూ.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పరకాలలో శంకుస్థాపనలు..
- దామెర మండలంలో రూ.12 కోట్లతో దామెర క్రాస్ రోడ్డు నుంచి పరకాల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు
- రూ.1.25 కోట్లతో నూతన తహసీల్దార్ భవన నిర్మాణం
- ఆత్మకూరు మండలంలో రూ.20 లక్షలతో కమ్యూనిటీ భవనాలు
- గీసుకొండ మండలం మచ్చాపుర్ నుంచి లక్ష్మీపురం వయా ఎలుకుర్తి రోడ్డు విస్తరణ పనులు.
- పరకాల మండలంలో రూ.1.25 కోట్లతో నూతన ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం.
- రూ.1.25 కోట్లతో పరకాల తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం
- నడికూడ మండలంలో రూ.1.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం.
వర్ధన్నపేటలో..
- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం ఒక్కరోజే రూ.75.04 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
- రూ.11.5 కోట్లతో పర్వతగిరి, నందనం, ఇల్లందలో చెక్‌డ్యాం పనులు.
- వర్ధన్నపేట మండలంలో రూ.2.60 కోట్లతో కోనారెడ్డి చెరువు పునరుద్ధరణ పనులు.
- పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్‌పర్తిలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో రూ.44 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు..
- వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో రూ.1.30 కోట్లతో మజీదుల అభివృద్ధి పనులు.
- వర్ధన్నపేట మండలంలో రూ.15 కోట్లతో కట్య్రాల నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన.
- ప్రారంభోత్సవాలు..
- రూ.1 కోటితో నిర్మించిన వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ నూతన భవనంను ప్రారంభించారు.
- నర్సంపేటలో..
- నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ఖానాపురం మండలంలో రూ.15 లక్షలతో నిర్మించిన మూడు కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు.
- ప్రతిపాదనలు
- ఆయా నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో మిగిలిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను చీఫ్ ప్లానింగ్ కార్యాలయంలో అందించారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన పీఏలు ప్రతిపాదనలను సీపీఓకు అందించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కలెక్టర్ హరితకు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment