workes
-
ముందస్తు హడావుడి
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ రద్దు వార్తల నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ నెల 6న అసెంబ్లీని రద్దు చేస్తే బుధవారం చివరి రోజు కావడంతో అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. బుధవారం రాత్రి వరకు పాల్గొని అధికార కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు జోరుగా శంకుస్థాపనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన పలు భవనాలను సైతం ప్రారంభించారు. రూ.111 కోట్ల పనులకు శంకుస్థాపనలు.. జిల్లాలో పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఒకే రోజు రూ.111.04 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ కార్యకర్తలను సమయాత్తం చేశారు. పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి బుధవారం ఒక్కరోజే రూ.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరకాలలో శంకుస్థాపనలు.. దామెర మండలంలో రూ.12 కోట్లతో దామెర క్రాస్ రోడ్డు నుంచి పరకాల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు రూ.1.25 కోట్లతో నూతన తహసీల్దార్ భవన నిర్మాణం ఆత్మకూరు మండలంలో రూ.20 లక్షలతో కమ్యూనిటీ భవనాలు గీసుకొండ మండలం మచ్చాపుర్ నుంచి లక్ష్మీపురం వయా ఎలుకుర్తి రోడ్డు విస్తరణ పనులు. పరకాల మండలంలో రూ.1.25 కోట్లతో నూతన ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం. రూ.1.25 కోట్లతో పరకాల తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం నడికూడ మండలంలో రూ.1.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం. వర్ధన్నపేటలో.. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం ఒక్కరోజే రూ.75.04 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.11.5 కోట్లతో పర్వతగిరి, నందనం, ఇల్లందలో చెక్‌డ్యాం పనులు. వర్ధన్నపేట మండలంలో రూ.2.60 కోట్లతో కోనారెడ్డి చెరువు పునరుద్ధరణ పనులు. పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్‌పర్తిలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో రూ.44 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు.. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో రూ.1.30 కోట్లతో మజీదుల అభివృద్ధి పనులు. వర్ధన్నపేట మండలంలో రూ.15 కోట్లతో కట్య్రాల నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన. ప్రారంభోత్సవాలు.. రూ.1 కోటితో నిర్మించిన వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ నూతన భవనంను ప్రారంభించారు. నర్సంపేటలో.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ఖానాపురం మండలంలో రూ.15 లక్షలతో నిర్మించిన మూడు కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. ప్రతిపాదనలు ఆయా నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో మిగిలిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను చీఫ్ ప్లానింగ్ కార్యాలయంలో అందించారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన పీఏలు ప్రతిపాదనలను సీపీఓకు అందించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కలెక్టర్ హరితకు అందించారు. -
శరవేగంగా కాళేశ్వరం పనులు
మహదేవపూర్: తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో నిర్మాణం చేపట్టి న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇంజినీర్లు అంకితభావంతో పనిచేస్తున్నారని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ఇంజినీర్లు, అధికారులతో బ్యారేజీ నిర్మాణంపై సమీక్షించారు. కాఫర్‌డ్యాం వద్ద గోదావరి ప్రవాహన్ని పరిశీలించారు. వానాకాలంలోనూ నిత్యం నాలుగు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పనులు చేయడం అద్భుతమని పేర్కొన్నారు. బ్యారేజీకి బిగించే 85 గేట్ల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం గ్రావిటీ కెనాల్ పనులు వేగవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. అత్యంత వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో దేశ నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొంటున్నారని, వారికి అవసరమైన సదుపాయాలతోపాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచామని చెప్పారు. కలెక్టర్ వెంట మేడిగడ్డ బ్యారేజీ ఈఈ రమణారెడ్డి, డీఈఈ సురేష్, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ రామరాజు తదితరులు ఉన్నారు. -
ప్రసవ వేదనలో 108
మెదక్‌రూరల్: ఆపద వస్తే వెంటనే అందరికి గుర్తుకు వచ్చేది 108. ఇప్పుడు ఆ 108 వాహనం ప్రసవ వేదనతో బాధపడుతోంది. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే ఆపద్బాంధవులు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కారు. కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పనిదినాలను కల్పించడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని పద్నాలుగు రోజులుగా సమ్మె బాట పట్టారు. జిల్లాలో మొత్తం ఎనిమిది 108 వాహనాలునాయి. ఇందులో 36 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 18 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్(ఈఎమ్‌టీ), 18 మంది పైలెట్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు ప్రతి పల్లెకు అందాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. 24 గంటల అత్యవసర వైద్య సేవలను ప్రాణాపాయ, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి అందించాలనే లక్ష్యంతో ఈ వాహనాలను ప్రారంభించారు. సమాచారం అందుకున్న 20 నిమిషాల వ్యవధిలోనే ఈ 108 వాహనం సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. అలాగే ఎంతో మంది గర్భిణులకు అంబులెన్స్‌లోనే పురుడుపోసి తల్లీబిడ్డలను సురక్షితంగా కాపాడుతున్న సిబ్బంది సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవులకు కనీస వేతన చట్టాల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు జీవీకే యాజమాన్య పట్టింపులేని దోరణి వ్యవహరిస్తుండటంతో సిబ్బంది కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హక్కుల సాధన కోసం108 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టారు. చాలీచాలని వేతనాలతో 12 గంటలు రెండు షిఫ్ట్‌లల్లో వెట్టిచాకిరి చేస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న వారికి కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పనిదినాలను కల్పించి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. జీఓ నంబర్ 3ను వెంటనే అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 108 వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న జీవీకే సంస్థను తొలగించి 108 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు. కరువైన ప్రథమ చికిత్స గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పాముకాటుకు గురైన వ్యక్తులను, ఒంటికి నిప్పంటించున్న వారికి అత్యవసర ప్రథమ చికిత్స చేసే 108 సిబ్బంది సమ్మెబాట పట్టడంతో అత్యవసర సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. సిబ్బంది సమ్మె చేస్తుండటంతో తాత్కాలిక సిబ్బందిని నియమించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అడ్డమీద నుంచి డ్రైవర్లను పైలట్లుగా, ఇటీవల శిక్షణ పొందిన ఎలాంటి అనుభవం లేని సిబ్బందిని నియమించారు. దీంతో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవం లేని డ్రైవర్లు వాహనాలను నడిపిస్తుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంలో తాత్కాలిక సిబ్బంది అవగాహన లేమితో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అనుభవం లేని డ్రైవర్ల కారణంగా జిల్లాలోని పలు చోట్ల 108 వాహనాలు ప్రమాదాలు జరిగి దెబ్బతిన్నాయనే సమాచారం ఉంది. సమ్మె నేపథ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలకు అత్యవసర సేవలు కరువయ్యాయనే చెప్పాలి. కార్మిక చట్టాన్ని అమలు చేయాలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలను కాపాడే మాకు కార్మిక చట్టం ప్రకారం న్యాయం చేయాలి. ఎనిమిది గంటల పని దినాలను కల్పించాలి. జీఓ నంబర్ 3ను అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకొని ప్రభుత్వమే 108 వ్యవస్థను నడిపించాలి. న్యాయమైన మా డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం చేస్తాం. –కె. పాండు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘంఉద్యోగ భద్రత కల్పించాలి పదమూడేళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా నియమిస్తూ కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పని దినాలను కల్పించాలి. జీఓ నంబర్ 3ను అమలు చేయాలి. 108 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలి. వెంటనే వేతనాన్ని కూడా పెంచి ఆదుకోవాలి. –ప్రసాద్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ -
ప్రజలు మీసం తిప్పే రోజులు రావాలి
గీసుకొండ(పరకాల): ‘మా నాయకుడు మంచి పని చేశాడంటూ ప్రజలు మీసం తిప్పే రోజులు రావాలి.. అంతే కానీ ఎవరో ఓ నాయకుడు ఇంట్లో కూర్చుని అంతా నేనే అంటూ మీసం తిప్పడం సరికాదు. నేను పట్టుబడితే అభివృద్ధి కాదు.. విజయాలు వెనుక నడుచుకుంటూ రావాల్సిందే.. దమ్ముంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పోటీకి రండి చూసుకుందాం..’ అని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 2, 3, 4వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ధర్మారంలో ఏర్పాటు చేసిన సభలో మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని. ఎమ్మెల్యేకు లక్ష్మణుడిగా, ఆంజనేయుడిగా ఉంటానన్నారు. ఇటీవల మేయర్ నన్నపునేని నరేందర్ పలు సమావేశాలు, కార్యక్రమాలతోపాటు వాట్సప్ సందేశాల్లో సొంత పార్టీలోని ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో ధర్మారం సభలోనూ తన ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన ఆయన.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రశంసల జల్లు కురిపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను మేయర్ హోదాలో చల్లా ధర్మారెడ్డికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. నమ్ముకున్న వారికి అండగా నిలిచే స్వభావం చల్లా ధర్మారెడ్డిది అని తెలిపారు. 3వ డివిజన్లోని ధర్మారంలో పండ్ల మార్కెట్, హోల్‌సేల్ వ్యాపారుల మార్కెట్ వస్తోందని, ఇవే కాకుండా మండలంలో టెక్స్టైల్ పార్కు, జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం చేకూరుతుందని తెలిపారు. స్థానిక రైతులు భూములను అమ్ముకోవద్దని, రానున్న రోజుల్లో «భూమి ధర పెరిగే అవకాశం ఉందని అన్నారు. త్వరలో విలీన గ్రామాల ప్రజలకు సాదామైనామాల ద్వారా పట్టా చేసుకునే అవకాశం, గొర్ల పెంపంకందార్లకు యూనిట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరామని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. విలీన గ్రామాల్లో ఇప్పటికే రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగం మౌనిక, ల్యాదెల్ల బాలు, టీఆర్ఎస్ నాయకులు సుంకరి శివ, గోలి రాజయ్య, మసూ ద్, జోషి, బిల్ల శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలీస్ ధర్మారావు, కార్యదర్శి పూండ్రు జయపాల్‌రెడ్డి, ‘నెక్’ ఉమ్మడి జిల్లా చైర్మన్ వీరగో ని రాజ్‌కుమార్, ఎంపీపీ ముంత కళావతి, మండ ల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మాధవరెడ్డి, ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సందెల సునీల్. జాగృతి నాయకులు పోలెబోయిన సాంబయ్య పాల్గొన్నారు. -
అధికార పార్టీ..అడ్డ‘దారి’
జిల్లాలో ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా.. టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి దక్కించుకుంటున్నారు. ఈ కోవలోనే కర్నూలు నగరంలో జరుగుతున్న పనులకు టెండర్ పెట్టారు. ఏకంగా రూ.1.25 కోట్ల పనులను సబ్లీజ్తో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇంజినీరింగ్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండడంచర్చనీయాంశమైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు ప్రతిపాదనలు అడగకపోవడం వివక్షకు తావిస్తోంది. ఎన్నికల కోసమే... ప్రతి నియోజకవర్గం నుంచి రహదారులు, భవనాల శాఖకు వందలాది పనుల కోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు సైతం దెబ్బతిని ఉండడంతో మరమ్మతులు, నూతన రహదారులు, అవసరమైన కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో అనుమతి లభించిన పనులు మాత్రం స్వల్పంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు పనులకు అనుమతి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఆశించిన ఫలితం లభించకపోవడంతో ప్రజలకు ముఖం చాటేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని కొందరు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండడంతో కొన్ని పనులైనా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో రూ.15 కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనుల వివరాల ప్రతిపాదలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి రూ.120 కోట్ల పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు తీసుకోవడం మంజూరయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష... కర్నూలు జిల్లాలో మొత్తం 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. అయితే ఐదుగురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడంతో అధికార పార్టీలో 8 మంది, ప్రతిపక్ష పార్టీలో ఆరుగురు ఉన్నారు. ఇందులో 8 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో రహదారులు, ఇతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఉన్న ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోలేదని తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇది తమపై వివక్ష చూపడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు తీరుపై తీవ్ర ఆక్షేపణలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతోంది. ఇది మొదటి నుంచి జరుగుతోంది. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జ్‌ల పేరుతో పనులు చేయించారు. ఇప్పుడు కేవలం టీడీపీ వారికే పనులు మంజూరు చేస్తున్నారు. మావి నియోజకవర్గాలు కాదా?..మా దగ్గర ఉన్నది ప్రజలు కాదా? వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. -
హరిత హోటల్ పనులకు బ్రేక్
గడువు ముగిసినా పూర్తి కాని నిర్మాణం కాంట్రాక్టర్‌కు బిల్లులు రాక నిలివేత టూరిజంశాఖ అధికారుల పర్యవేక్షణ కరువు కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న హరితహోటల్ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం.. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వెరసి నిర్మాణం ఆలస్యమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 31వరకే పూర్తి కావాల్సి ఉన్నా ఆ దిశగా పనులు కొనసాగడంలేదు. ఇప్పటివరకు 85శాతం పూర్తయ్యాయని, బిల్లులు చెల్లిస్తే పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. కాళేశ్వరంలో 2012–13లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హరితహోటల్ నిర్మాణం కోసం టూరిజంశాఖ నుంచి నిధులు మంజూరుచేసింది. అప్పటిమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషితో రూ.4కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాళేశ్వరంలో ప్రభుత్వ స్థలం లేక పలుమార్లు రెవెన్యూ, టూరిజంశాఖ అధికారులు సర్వేలు నిర్వహించి విఫలమయ్యారు. నిధులు తిరిగి వెళ్తున్న క్రమంలో 2014లో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చొరచూపారు. అధికారులతో మాట్లాడి కాళేశ్వరంలోని మూడెకరాల స్థలాన్ని కేటాయించేలా చూశారు. ఆ భూమిని టూరిజంశాఖ అధికారులకు అప్పగించడంతో రావూస్ కన్స్ట్రక్షన్స్ సంస్థ హరితహోటల్ పనులు మొదలు పెట్టింది. పనులు మెల్లగా.. కాంట్రాక్టర్ పనులు చేపట్టినప్పటి నుంచి జాప్యంచే స్తున్నాడనే ఆరోపణలున్నాయి. దీనిపై సదరు కాంట్రాక్టర్ సంస్థలకు మెమోలు ఇచ్చి బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. 2016 ఆగస్టు 31 వరకు హరితహోటల్ నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా.. బిల్లులు రాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 85 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో వారం రోజులుగా పనులు నిలిపినట్లు సమాచారం. ముందస్తుగా బిల్లులు చేస్తే మూడు నెలల ముందుగానే పూర్తి చేసేవాళ్లమని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఇంకా విద్యుత్ కనెక్షన్, ఫ్లోరింగ్, టైల్స్, రంగులు వేయడం తదితర పనులు మిగిలిఉన్నాయి. టూరిజంశాఖ అధికారులు మాత్రం హోటల్ పనులు పర్యవేక్షించకుండా ఇతరులతో బిల్లులు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాస్థాయి అధికారులు స్పందించి కాంట్రాక్టర్లకు బిల్లులు అందించి భక్తులకు హరితహోటల్ అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. బిల్లుల రాకనే ఇబ్బంది –శ్రీనివాస్, రావూస్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ బిల్లుల సకాలంలో అందకనే పనులు నత్తనడక సాగుతున్నాయి. మొదటినుంచి బిల్లుల రావడం లేదు. కొన్ని బిల్లులు మాత్రమే వచ్చాయి. పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు అందిస్తే మూడు నెలల ముందే హోటల్ అందించేవాళ్లం. ఆగస్టు 31 గడువులోగా పూర్తి చేయాలి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. బిల్లులు ఇస్తే నెలలోపు పూర్తి చేస్తాం. పనులు నిదానంగా.. –జీవన్‌రెడ్డి, టూరిజంశాఖ ఏఈఈ హరితహోటల్ పనులు కాంట్రాక్టర్ నిదానంగా చేస్తుండు. ఈ విషయంలో వారికి పనులు సక్రమంగా జరగడం లేదని మెమోలు ఇచ్చాం. కొన్ని సాంకేతిక సమస్యలతో బిల్లులు మంజూరు కాలేదు. -
పునరావాస కాలనీల పనులు వేగవతం చేయాలి
కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర: ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పనుల ప్రగతిపై సమీక్షించారు. కోటిలింగాల, చెగ్యాం, చీర్లవంచ పునరావాస కాలనీల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోటిలింగాలకు మంజూరైన హైలెవల్ బ్రిడ్జి పనులను వర్షాలు తగ్గగానే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొత్తగా నిర్మించే కాలనీల్లో తాగునీరు, రోడ్లు ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.