మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్లు
మహదేవపూర్: తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో నిర్మాణం చేపట్టి న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇంజినీర్లు అంకితభావంతో పనిచేస్తున్నారని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ఇంజినీర్లు, అధికారులతో బ్యారేజీ నిర్మాణంపై సమీక్షించారు. కాఫర్‌డ్యాం వద్ద గోదావరి ప్రవాహన్ని పరిశీలించారు. వానాకాలంలోనూ నిత్యం నాలుగు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పనులు చేయడం అద్భుతమని పేర్కొన్నారు. బ్యారేజీకి బిగించే 85 గేట్ల గురించి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం గ్రావిటీ కెనాల్ పనులు వేగవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. అత్యంత వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో దేశ నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొంటున్నారని, వారికి అవసరమైన సదుపాయాలతోపాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచామని చెప్పారు. కలెక్టర్ వెంట మేడిగడ్డ బ్యారేజీ ఈఈ రమణారెడ్డి, డీఈఈ సురేష్, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ రామరాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment