ధర్మారంలో మాట్లాడుతున్న నగర మేయర్ నన్నపునేని నరేందర్
గీసుకొండ(పరకాల): ‘మా నాయకుడు మంచి పని చేశాడంటూ ప్రజలు మీసం తిప్పే రోజులు రావాలి.. అంతే కానీ ఎవరో ఓ నాయకుడు ఇంట్లో కూర్చుని అంతా నేనే అంటూ మీసం తిప్పడం సరికాదు. నేను పట్టుబడితే అభివృద్ధి కాదు.. విజయాలు వెనుక నడుచుకుంటూ రావాల్సిందే.. దమ్ముంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పోటీకి రండి చూసుకుందాం..’ అని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 2, 3, 4వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ధర్మారంలో ఏర్పాటు చేసిన సభలో మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని.
ఎమ్మెల్యేకు లక్ష్మణుడిగా, ఆంజనేయుడిగా ఉంటానన్నారు. ఇటీవల మేయర్ నన్నపునేని నరేందర్ పలు సమావేశాలు, కార్యక్రమాలతోపాటు వాట్సప్ సందేశాల్లో సొంత పార్టీలోని ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో ధర్మారం సభలోనూ తన ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన ఆయన.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రశంసల జల్లు కురిపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను మేయర్ హోదాలో చల్లా ధర్మారెడ్డికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. నమ్ముకున్న వారికి అండగా నిలిచే స్వభావం చల్లా ధర్మారెడ్డిది అని తెలిపారు. 3వ డివిజన్‌లోని ధర్మారంలో పండ్ల మార్కెట్, హోల్‌సేల్ వ్యాపారుల మార్కెట్ వస్తోందని, ఇవే కాకుండా మండలంలో టెక్స్‌టైల్ పార్కు, జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం చేకూరుతుందని తెలిపారు. స్థానిక రైతులు భూములను అమ్ముకోవద్దని, రానున్న రోజుల్లో «భూమి ధర పెరిగే అవకాశం ఉందని అన్నారు.
త్వరలో విలీన గ్రామాల ప్రజలకు సాదామైనామాల ద్వారా పట్టా చేసుకునే అవకాశం, గొర్ల పెంపంకందార్లకు యూనిట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరామని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. విలీన గ్రామాల్లో ఇప్పటికే రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగం మౌనిక, ల్యాదెల్ల బాలు, టీఆర్‌ఎస్ నాయకులు సుంకరి శివ, గోలి రాజయ్య, మసూ ద్, జోషి, బిల్ల శ్రీకాంత్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోలీస్ ధర్మారావు, కార్యదర్శి పూండ్రు జయపాల్‌రెడ్డి, ‘నెక్’ ఉమ్మడి జిల్లా చైర్మన్ వీరగో ని రాజ్‌కుమార్, ఎంపీపీ ముంత కళావతి, మండ ల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మాధవరెడ్డి, ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సందెల సునీల్. జాగృతి నాయకులు పోలెబోయిన సాంబయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment