మహానాడు వేళ మనోవేదన | TDP MLAS disappointed about the Nominated posts | Sakshi
Sakshi News home page

మహానాడు వేళ మనోవేదన

Published Tue, May 16 2017 3:28 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

మహానాడు వేళ మనోవేదన - Sakshi

మహానాడు వేళ మనోవేదన

ఉసూరుమనిపించిన బాబు
 
 
విశాఖపట్నం : విశాఖలో మహానాడు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మనోవేదన మిగిల్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు నామినేటెడ్‌ పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రకటించి పెద్ద షాక్‌ ఇచ్చారు. దీంతో మూడేళ్లుగా నామినేటెడ్‌ పోస్టుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కంగుతిన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్వార్థంతో తెలుగుదేశంలోకి జంప్‌ చేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనకూ అమాత్య పదవి ఖాయమని కలలుగన్నారు. ఈ ముగ్గురికీ మంత్రివర్గంలో ఆ పార్టీ అధినేత మొండిచేయి చూపించారు. 
బండారు కొన్నాళ్ల పాటు అలకపూని పార్టీ కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి సభలకూ దూరంగా ఉన్నారు. నెలరోజుల తర్వాత అలక వీడి మళ్లీ జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వుడా చైర్మన్‌ పదవి గాని, లేదా కేబినెట్‌ హోదా ఉన్న ఏదైనా కార్పొరేషన్‌ పదవి తనకు వస్తుందని ఎంతో ఆశాభావంతో ఉన్నారు.

ఇక ఎమ్మెల్యే అనిత  కూడా మంత్రి పదవి రాకున్నా నామినేటెడ్‌ తప్పక వస్తుందని ధీమాగా ఉన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ ఫిరాయింపు, గిరిజన కోటాలో మంత్రినవుతానని ఊర్రూతలూగారు. కానీ ఆయనకు కూడా బాబు చేయిచ్చారు. విశాఖ పశ్చిమ శాసనసభ్యుడు గణబాబు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల  రమేష్‌బాబు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి ఏదైనా మంచి కేబినెట్‌ హోదా కలిగిన కార్పొరేషన్‌ పదవి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్యేలకు నామినేటెడ్‌ పదవుల ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో ఆశావహులంతా తీవ్ర నైరాశ్యంలో పడ్డారు. మరో పది రోజుల్లో మహానాడు జరుగుతున్నందున వీరంతా ఆ కార్యక్రమానికి ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తారన్నది ప్రశ్నార్థకమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు మహానాడు కమిటీల్లో భాగస్వాములై ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. అధినేత నిర్ణయంపై నామినేటెడ్‌ పదవులు ఆశించిన ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement