కిడారి దురాక్రమణ
కిడారి దురాక్రమణ
Published Sun, Jul 17 2016 11:22 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అవినీతి, అక్రమాలు తవ్వేకొద్దీ కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. అనంతగిరి మండలం గరుగుబిల్లిలో గిరిజనుల డీఫారం భూములను కాజేయడం, వాలాసి పంచాయతీలో అక్రమంగా కాలె్సౖట్ మైనింగ్ చేపట్టడం, సర్కారు నిధులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు సోకులు చేయించుకోవడం, బినామీ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా క్వారీ తవ్వకాలు.. గంజాయి అక్రమ రవాణాదారులకు తెరవెనుక వెన్నుదన్నుగా ఉండటం... ఇలా మన్యంలో అడ్డగోలు దందాలతో రెచ్చిపోతున్న కిడారి అక్రమాల పర్వంలో మరో మజిలీ బయటపడింది. పాడేరులో ఖాళీ స్థలాన్ని అక్రమించేసి అడ్డగోలుగా భవనాన్ని నిర్మించేసుకుంటున్న వైనంపై స్థల హక్కుదారులు కోర్టుకు వెళ్లినా కిడారి వెనక్కి తగ్గలేదు. ఎంచక్కా భవనం నిర్మించేసుకుంటున్నారు. ఈ వ్యవహరం పూర్వాపరాలిలా ఉన్నాయి.
పాడేరు మెయిన్‌రోడ్డులోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న 6 సెంట్ల ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆక్రమించేశారు. ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ కోసం పిల్లర్స్ నిర్మాణం చేపట్టారు. తమకు పిత్రార్జితంగా లభించిన స్థలాన్ని ఎమ్మెల్యే దురాక్రమణ చేశారంటూ స్థలం వారసులు కొట్టగుళ్లి కోటిబాబు, భరత్‌నాయుడు గత నెల 6న జిల్లా కలెక్టర్ యువరాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో పాడేరు సబార్డినేట్ జడ్జి కోర్టులో ఎమ్మెల్యే అక్రమ నిర్మాణంపై బాధితులు సివిల్ కేసు (ఏఓఎస్13/2016), (ఐఏ 2/2016) వేశారు. కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ కిడారి ఇంటి నిర్మాణం మాత్రం ఆగలేదు.
పాడేరుకు చెందిన కొట్టగుళ్లి అప్పల నాయుడుకు స్వాతంత్య్రానికి పూర్వం ముఠాదారీవ్యవస్థలో భాగంగా భూమి కేటాయించారు. కాలక్రమేణా ఈ స్థలాన్ని పాడేరులోని గిరిజనేతరుడైన సత్యవరపు సత్యానందం అనే ఆసామి ఆక్రమించి భవనం నిర్మించాడు. దీనిపై అప్పట్లో కొట్టగుళ్లి అప్పలనాయుడు ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులరైజేషన్ (ఎల్‌టీఆర్) కింద కేసు వేశారు. ఎల్‌టీఆర్ యాక్టు (భూబదలాయింపు చట్టం 1/70) ప్రకారం గిరిజనులు, గిరిజనేతరుల మధ్య క్రయవిక్రయాలు లేవు. ఈ కేసు విచారణ అనంతరం అనకాపల్లి సెటిల్‌మెంట్ అధికారి ఇచ్చిన పట్టా ఆధారంగా పాడేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్... అప్పలనాయుడుకు అనుకూలంగా తీర్పునిచ్చారు. స్థలాన్ని ఆయనకు అప్పగిస్తూ 19.11.1982 లో ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సదరు గిరిజనేతరుడు అక్కడ నిర్మించిన భవనాన్ని కూల్చివేసి స్థలం వదిలేశారు. దీని తరువాత అప్పలనాయుడు వారసులైన కోటిబాబు, భరత్‌నాయుడు తాత పేరిట ఉన్న స్థలంలో ఉన్న భవనం శిథిలాలను తొలగించి బాగు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ స్థలం వారి స్వాధనంలోనే ఉంది. అయితే మెయిన్‌రోడ్డులో ఖాళీగా ఉన్న విలువైన స్థలంపై అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కన్ను పడింది. అంతే.. దీన్ని ఆక్రమించేసి భవననిర్మాణం చేపట్టేశారు.
ఆ స్థలం మాదే...
ఆ స్థలం మాదే.. ఎమ్మెల్యే కిడారికి ఎటువంటి హక్కు లేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టులో కేసు కూడా వేశాం. విచారణ కొనసాగుతోంది. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. అయినా సరే ఆయన భవన నిర్మాణాన్ని ఆపలేదు. ఎమ్మెల్యే అధికారం, ధనబలంతో అక్రమ నిర్మాణం చేపట్టేశారు.
– స్థలదారుడు కొట్టగుళ్లి కోటిబాబు
విచారణ జరుగుతోంది..
పాడేరులో తమ భూమిని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆక్రమించేసి ఇల్లు నిర్మిస్తున్నారంటూ కొట్టగుళ్లి కోటిబాబు, భరత్ నాయుడులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాల్సిందిగా పాడేరు సబ్ కలెక్టర్ ఎల్.శివశంకర్‌ను ఆదేశించాం. నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయి.
–కలెక్టర్ యువరాజ్
Advertisement