ఇదిగో..మీ పనితీరు | trs secret survey for common district mla‘s | Sakshi
Sakshi News home page

ఇదిగో..మీ పనితీరు

Published Fri, Mar 10 2017 5:25 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

ఇదిగో..మీ పనితీరు - Sakshi

ఇదిగో..మీ పనితీరు

జిల్లా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందన్న దానిపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వే వివరాలు బయటకు వచ్చాయి.

► ఉమ్మడి జిల్లా 12 మంది ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ మార్కులు
► పైళ్ల టాప్‌.. ఆ తర్వాత వేముల వీరేశం
► అట్టడుగున పద్మావతి, భాస్కరరావు... కిశోర్‌ది కూడా అదే బాట...
► గత సర్వే కన్నా ఈసారి సర్వేలో మంత్రి జగదీశ్‌రెడ్డికి తక్కువ ఆదరణ
► గతం కన్నా మెరుగైన స్థితిలో జానా, కూసుకుంట్ల
► ఉత్తమ్, కోమటిరెడ్డి, సునీత, రవీంద్రకుమార్‌లకూ తగ్గిన ఆదరణ
► అంతర్గత సర్వే వివరాలను జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలకిచ్చిన కేసీఆర్‌
► ఆరునెలల్లోనే రెండు సార్లు సర్వే జరిగిందంటున్న టీఆర్‌ఎస్‌ వర్గాలు
► పార్టీ పరంగా నకిరేకల్‌ ఫస్ట్‌...మిర్యాలగూడ లాస్ట్‌
 
సాక్షి, నల్గొండ: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికై మూడేళ్లు కావస్తోంది. శాసనసభ సభ్యులుగా ఆయా నియోజకవర్గాల్లో మూడేళ్లుగా మన ఎమ్మెల్యేలంతా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి వారి స్థాయిల్లో తమదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్నారు మన  ఎమ్మెల్యేలు. 
 
మూడేళ్లు పూర్తయ్యే సమయంలో ఈ ఎమ్మెల్యేలకు ‘పరీక్ష’ ఫలితాలు వచ్చాయి. శాసనసభ్యులుగా వారి పనితీరు ఎలా ఉందన్న దానిపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వే వివరాలు బయటకు వచ్చాయి. ఇంకేముంది.... ఆ సర్వేలో ఎవరికెన్ని మార్కులు వచ్చాయి... ఏ ఎమ్మెల్యేకు ఎక్కువ మార్కులు వచ్చాయి... మా ఎమ్మెల్యేకు ఎన్ని వచ్చాయి... ఇదేగా మీ ఉత్కంఠ... అయితే, ఇదిగో చదవండి. 
 
భువనగిరి, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు టాప్‌...
టీఆర్‌ఎస్‌ తాజాగా నిర్వహించిన అంతర్గత సర్వేల ఫలితాల ప్రకారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎక్కువమార్కులు పొందారు.  ఈ ఇద్దరే జిల్లా నుంచి టాప్‌లో ఉన్నారు. ఆరునెలల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన సర్వేల్లోనూ ఇద్దరికీ మంచి ఫలితాలే వచ్చాయి. మొదటి సర్వేలో భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పనితీరుపై 71.20శాతం మంది ప్రజలు ఓకే అంటే రెండో సర్వేలో మరో 10శాతం మంది అధికంగా 81.90శాతం మంది ఓకే అన్నారు.
 
నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం కూడా ప్రజల్లో మంచి మార్కులే సంపాదించారు. ఈయన పనితీరు పట్ల మొదటి సర్వేలో 71.90 మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా, రెండో సర్వేలో రెండు శాతం తక్కువగా...అంటే 69.70 మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అధికార పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు ప్రజామోదంగానే ఉందని ఈ సర్వే ఫలితాలు చెపుతున్నాయి. 
 
మరో ఐదుగురికి 50శాతం పైమాటే..
 మిగిలిన వారి విషయానికి వస్తే మరో ఐదుగురు ఎమ్మెల్యేల పనితీరు పట్ల కూడా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజల్లో 50 శాతం మంది సంతృప్తితోనే ఉన్నారని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. వీరిలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కె.జానారెడ్డి, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు రెండో సర్వేలో 50శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు ఓకే చెప్పారు. అయితే, ఇందులో ఉత్తమ్, కోమటిరెడ్డి, రవీంద్రకుమార్‌లకు తొలి సర్వే కన్నా కొంచెం ఆదరణ తగ్గగా, తొలి సర్వే కంటే మునుగోడు, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యేలకు ఎక్కువ ఆదరణ కనిపించింది. మొత్తంమీద ఈ ఐదుగురు కూడా ప్రజల్లో మంచి అభిప్రాయాన్నే సంపాదించుకున్నారని టీఆర్‌ఎస్‌ అంతర్గత సర్వేలో వెల్లడైంది. 
 
రెండో సర్వేలో...
జిల్లా నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీశ్‌రెడ్డి తొలి సర్వేలో 12 మంది ఎమ్మెల్యేల్లోనే అత్యధికంగా 94.30 మార్కులు తెచ్చుకోగా, రెండో సర్వేలో మాత్రం పడిపోయారు. ఆయన పనితీరు పట్ల కేవలం 45.40 మంది ప్రజలు మాత్రమే సంతృప్తితో ఉన్నారని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. అసెంబ్లీలో విప్‌గా ఉన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతది కూడా అదే పరిస్థితి. తొలి సర్వేలో ఆమెకు 73.70 శాతం మంది ప్రజలు మద్దతు పలకగా, రెండోసారి నిర్వహించిన సర్వేలో కేవలం 45శాతం మందే మద్దతిచ్చారు. ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా పాసయ్యారు కానీ...రెండు సర్వేల్లో లభించిన ఆదరణ విషయంలో కొంత తిరోగమనం ఉండడం గమనార్హం. 
 
ఈ ముగ్గురికి...
మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, గాదరి కిశోర్, భాస్కరరావులకు తక్కువ మార్కులు వచ్చినట్లు సర్వే ఫలితాలు చెపుతున్నాయి. వీరు ముగ్గురికీ 40 కన్నా తక్కువ శాతం మార్కులే వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోనే అందరికంటే తక్కువగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డికి ఆ నియోజకవర్గంలోని కేవలం 31.80 శాతం మంది నుంచే మద్దతు లభించింది. మొదటి సర్వేలోనూ ఆమెకు అత్తెసరు మార్కులే వచ్చాయని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. అందులో ఆమెకు 38.30శాతం మంది ప్రజలు మద్దతిచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా రెండు సర్వేల్లోనూ వెనుకబడ్డారు.
 
ఆయనకు తొలి సర్వేలో కేవలం 36 శాతం మంది ప్రజలు మద్దతిస్తే, రెండో సర్వేలో అంతకంటే తక్కువగా 34.70 మంది మద్దతు మాత్రమే లభించింది. మరో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు అదే విధంగా ఉందని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. ఆయన పనితీరు పట్ల మొదటి సర్వేలో 67.40శాతం మంది ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమయితే, రెండో సర్వేలో కేవలం 35.80 మంది మాత్రమే ఓకే అనడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement