
మార్పులు.. చేర్పులు
అధికార యంత్రాంగంపై పట్టు కోసం గులాబీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పనిచేసిన వారిని వదిలించుకునే పనిలో పడ్డారు.
అధికార యంత్రాంగంపై పట్టు కోసం గులాబీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పనిచేసిన వారిని వదిలించుకునే పనిలో పడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనే కాదు.. విపక్ష ఎమ్మెల్యేలున్న చోటా తమమాటే నెగ్గాలన్న వ్యూహంతో ‘మార్పులు-చేర్పులు’పై అధినేత వద్ద ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టారు..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా పాలనలో తమ ముద్ర ఉండాలంటే ముందుగా అధికార యంత్రాం గంలో భారీ మార్పులు జరగాలని అధికార టీఆర్‌ఎస్ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. దశాబ్దకాలం పాటు కాంగ్రెస్ నేతల చెప్పుచేతల్లో ఉన్న అధికారులు ఇంకా ‘పార్టీ’ మారలేదని, ఇప్పటికీ వారు చెప్పినట్లే వింటున్నారన్న ఆందోళన గులాబీ నేతల్లో ఉంది. జిల్లాపై ఆధిపత్యం పెంచుకునేందుకు తాము కోరిన అధికారులకు కోరిన చోట పోస్టింగులు ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయానికి వీరు వచ్చారు. పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు ఇన్‌చార్జ్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. నియోజకవర్గాల్లో పనులు చేయడానికి, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కిందిస్థాయిలో పనిచేసే అధికారులు కీలకం.
అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపీడీఓల పాత్ర ముఖ్యం. అదే మాదిరిగా, పోలీసుశాఖలో ఎస్‌ఐలు, సీఐలు ప్రధానమే. ఇక, డివిజన్ స్థాయిలో డీఎస్పీ, ఆర్డీఓలు అతి ప్రధానమే. అయితే, చాలా మండలాల్లో పాత అధికారులే పనిచేస్తున్నారు. వీరు దాదాపుగా కాం గ్రెస్ నేతల ద్వారా పోస్టింగులు పొందినవారే కావడం గమనార్హం. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎలాగోలా పనులు చేయించుకోగలుగుతున్నా, పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో అధికారులు ఇన్‌చార్జ్‌లను లెక్కపెట్టడం లేదని, ఇప్పటి కీ కాంగ్రెస్ నేతల వైపే మొగ్గుచూపుతున్నారన్నది వీరి అభియోగం. సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాగార్జుసాగర్, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండల్లో కాంగ్రెస్, దేవరకొండలో సీపీఐ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈ నియోజకవర్గాలపై పార్టీకి పట్టు రావాలంటే ఇన్‌చార్జ్‌లు కోరిన వారికి పోస్టింగులు ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. వీరి అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం తనకు అధికారుల జాబితా ఇవ్వాలని సూచించారని, జిల్లాలో ముఖ్యమైన మరో అధికారిని కూడా మార్చాలని వీరంతా సీఎంను కోరారని సమాచారం. ప్రధానంగా నల్లగొండ ఆర్డీఓ, నల్లగొండ డీఎస్పీల మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే మాదిరిగా నల్లగొండ మండలంలోని అధికారుల మార్పుపైనా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా పోలీసు శాఖలో డీఎస్పీ స్థాయిలోనే లూప్‌లైన్‌లో పనిచేస్తున్న ఓ అధికారి టీఆర్‌ఎస్ నేతల ద్వారా డీఎస్పీ పోస్టింగు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న జిల్లాకే చెందిన ఓ రెవె న్యూ అధికారి సైతం నల్లగొండ ఆర్డీఓ పోస్టింగుపై గురిపెట్టి పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి జగదీష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట ఆర్డీఓ మార్పు జరిగిన విషయం తెలి సిందే. గులాబీ నేతలు ఇచ్చిన జాబితాకు సీఎం ఆమోదముద్ర వేస్తే జిల్లాలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఎస్సై, సీఐల మార్పులు చేర్పులు భారీ ఎత్తున జరిగే వీలుంది. కొందరు జిల్లాస్థాయి అధికారులకూ స్థానచలనం తప్పకపోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘జిల్లాలో ఏయే అధికారి ఏ నేత చెప్పుచేతల్లో ఉన్నారో మాకు తెలుసు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో వారెలా పనిచేశారో, ఎవరికి అనుకూలంగా వ్యవహరిం చారో కూడా తెలుసు. ఇంకా, వాళ్లనే నమ్ముకుని ఎలా ముందుకు పోగలుగుతాం. కొత్త వారి అవసరం కనిపిస్తోంది’ అని టీఆర్‌ఎస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.