
'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి'
అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
చండూరు: నల్లగొండ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలిద్దరూ భూ కబ్జాలు, నకిలీ నోట్లు, ఇసుక దందాలు చేస్తున్నా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సూర్యాపేటలో ఓ భూ వివాదంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఐదు రాష్ట్రాల్లో అక్రమ ఆస్తులు సంపాదించిన గ్యాంగ్స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణ చేస్తే న్యాయం జరగదని...వెంటనే ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసి కేసు సీబీఐకి అప్పగించాలని కోరారు. నయీమ్‌కు టీఆర్‌ఎస్ పార్టీ నేతలతో 90 శాతం వరకు సంబంధాలున్నాయని చెప్పారు. నయీమ్‌తో సంబంధాలు ఉన్న ఓ టీఆర్‌ఎస్ నాయకుడిపై ఇటీవలే కేసు నమోదైందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.