ఇన్నాళ్లూ ఏమయ్యారు
Published Tue, Oct 25 2016 1:16 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
భీమవరం : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి సహకరించాలని అడిగేందుకు వెళ్లిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు చేదు అనుభవం ఎదురైంది. భీమవరం మండలం తుందుర్రును ఆనుకుని ఉన్న జొన్నలగరువు గ్రామానికి సోమవారం రాత్రి ఎమ్మెల్యే వెళ్లగా, గ్రామస్తులు ఆయనను చుట్టుముట్టారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు సోమవారం సాయంత్రం కంసాలి బేతపూడిలోని ఓ కాలనీకి రహస్యంగా వెళ్లిన అంజిబాబు ఫుడ్‌పార్క్ అనుకూల వర్గానికి చెందిన కొందరితో మాట్లాడారు. అనంతరం జొన్నలగరువు గ్రామంలోని చర్చిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చర్చి వద్దకు చేరుకోగానే అక్కడి ప్రజలు ఆయనను చుట్టుముట్టారు. చర్చిలో సమావేశాలు వద్దని, ఏమైనా ఉంటే బయటే నిలబడి మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే ప్రజల మధ్య నిలబడి ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేయగా మహిళలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ‘ఆక్వా పార్క్ వద్దంటూ రెండున్నరేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే మీకు ఇప్పుడు గుర్తొచ్చామా.. సామాన్య జనంపై కేసులు పెట్టినప్పుడు, 144 సెక్షన్ పెట్టి ప్రజల్ని వేధించినప్పుడు ఏమయ్యార’ని నిల దీయడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ‘ఆక్వా పార్క్ కట్టొద్దంటూ మీరెవరూ నా దగ్గరకు రాలేదు’ అని చెప్పే ప్రయత్నం చేయగా.. ‘అనేకసార్లు వినతి పత్రాలతో మీ ఆఫీసుకొచ్చాం. వాటిని చెత్తబుట్టలో వేసి ఆక్వా పార్క్ యాజ మాన్యానికి కొమ్ముకాస్తున్నార’ంటూ మహిళలు దుయ్యబట్టారు. ‘హైదరాబాద్‌లో ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మా ఇబ్బందులు తెలియడంతో ఆయనే స్వయంగా ఇక్కడికొచ్చి మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రజలకు హాని కల్గించే ఫ్యాక్టరీలు నివాసాల మధ్య కట్టడం మంచిది కాదని చెప్పారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీకు మాత్రం మా ఇబ్బందులు పట్టవా’ అని నిలదీశారు. తాను ఫ్యాక్టరీ కావాలన్న వారికే అండగా ఉంటానన్న అంజి బాబు, టీడీపీ నేతలు వెళ్లిపోయారు.
అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య కొట్లాట
ఇదిలావుండగా, ఎమ్మెల్యే అంజిబాబు జొన్నలగరువు రావడంతో ఆక్వా పార్క్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చిచ్చు రగిలింది. రెండువర్గాల తోపులాట జరిగి కొట్లాటకు దారితీసింది. జొన్నలగరువు గ్రామస్తులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే వెనుదిరగగా.. ఆక్వా పార్క్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కొట్లాటకు దిగటంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే, ఫుడ్‌పార్క్ యాజమాన్యం పెంచిపోషిస్తున్న వర్గం పోలీసుల సమక్షంలోనే తమను దూషిస్తూ కొట్లాటకు దిగిందని గ్రామానికి చెందిన కొయ్యే లూసీ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement