‘11 రోజులు దీక్ష.. ఆ రహస్యం ఏమిటో..!’ | YSRCP MLAs Slams To TDP MP CM Ramesh Hunger Strike | Sakshi

‘దోచుకో దాచుకో అన్నదే వాళ్ళ సిద్ధాంతం’

Published Sat, Jun 30 2018 8:01 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

YSRCP MLAs Slams To TDP MP CM Ramesh Hunger Strike - Sakshi

సాక్షి, కడప : టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ దీక్షపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సీఎం రమేష్‌ హై టెక్‌ దీక్ష సాగిందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయాలను దారపోసి దీక్ష చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు 11 రోజుల తర్వాత వచ్చి తుస్సు మనిపించాడని ఎమ్మెల్యే అన్నారు. రూ. 10వేల కోట్లు కేటాయిస్తాడేమో అని అందరూ ఆశ పడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

‘25 సీట్లు ఇస్తే స్టీల్‌ ప్లాంట్‌ తెస్తాడట. ఇప్పుడు 19 మంది ఉన్నారు. ఏం ఉద్ధరించావ్‌? కడప ప్రజలకు అరగుండు గీశాడు. నాలుగేళ్లు కలిసి కాపురం చేసి ఇప్పుడు బీజేపీని మా పార్టీకి అంటగడుతున్నావు. చంద్రబాబు ఎంత తప్పు చేశాడో.. బీజేపీ కూడా అంతే తప్పు చేసింది. తిరుపతిలో హోదా అంటూ హామీలు ఇచ్చారు. 11 రోజుల తర్వాత కూడా సీఎం రమేష్‌ 5 నిమిషాలు ఎలా మాట్లాడగలిగాడో.. నిపుణులు ఆయనపై రీసెర్చ్‌ చేయాలి. ఆయన రహస్యం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. అధికారులు పరాకాష్టగా జిల్లా పరిపాలన వదిలేసి కలెక్టర్‌ కూడా సేవలు చేశారు. 540 ఆర్టీసీ బస్సులు దీక్షకు వాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని పార్టీలను కలుపుకుని ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తోంది. రాకపోతే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాగానే 6 నెలలకు శంకుస్థాపన చేస్తాం. 2 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తాం. ఉక్కు కోసం అందరం రాజీనామా చేద్దాం.. ఉక్కు ఎందుకు రాదో చూద్దాం’ అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 

రాజకీయ దీక్ష.. ఒక హైడ్రామా క్లయిమాక్స్‌..
సీఎం రమేష్‌ దీక్షపై వైఎస్సార్‌సీపీ కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా స్పందించారు. సీఎం రమేష్ రాజకీయ దీక్ష ఒక హై డ్రామా క్లయిమాక్స్‌ అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు  బాబు ఉక్కు వరాలు తేస్తాడని ఆశించి నిరసపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే దీక్షలు అని అంజాద్‌ బాషా విమర్శించారు. సీఎం చంద్రబాబుకు ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ రావాలని లేదని ఆయన పేర్కొన్నారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఆ క్రెడిట్ దివంగత నేత వైఎస్సార్‌కు వస్తుందని బాబుకు భయమని అన్నారు. కడప ఉక్కు అడ్డుకుంది చంద్రబాబే అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

దీక్షలపై వాళ్ళ ఎంపీలకు ఎంత చులకన భావన ఉందో అందరిరీ తెలిసిపోయిందని అన్నారు. దోచుకో.. దాచుకో అన్నదే వాళ్ళ సిద్ధాంతం అని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష వల్ల సీఎం రమేష్‌ ఏం సాధించుకున్నారో అని నిలదీశారు. మా ప్రభుత్వం రాగానే మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆరు నెలల్లో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తాం.. లేదంటే మేము రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే అంజాద్‌ బాషా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement