
సాక్షి, కడప : తన ప్రవర్తన ద్వారా చంద్రబాబు ఓటమి అంగీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటు ఎవరికి వేశామో అని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయడం హేయమని చర్య అని మండిపడ్డారు. ప్రజలు పాలన మార్పుకు సిద్ధంగా ఉన్నారని.. 140 పైచిలుకు సీట్లతో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందని పేర్కొన్నారు. ఇప్పటికైన చంద్రబాబు చిల్లర చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. ‘ 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచావు కదా అప్పుడు అనుమానం రాలేదా? వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టారు. ఇప్పుడేమో ఓటమి భయంతో మతిభ్రమించినట్లు ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే హుందాగా వ్యవహరించండి’ అని కొరుముట్ల శ్రీనివాసులు.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.
అక్కడైతే ఎప్పుడో ఉరితీసేవారు..
ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని వైఎస్సార్ సీపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన వంటి నాయకుడిని, టీడీపీ వంటి పార్టీని రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకుడు గల్ఫ్ దేశాల్లో ఉంటే ఎప్పుడో ఉరి తీసేవారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి తెలుసుకున్న ప్రజలు పాలనలో మార్పు కోరుకున్నారని.. నవరత్నాలే వైఎస్సార్ సీపీని గెలిపించనున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు దగ్గర నుంచి గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని.. ఆయన అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎవరున్నా ప్రత్యేక హోదా తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment