
ఆ ఏడుగురు బీజేపీలోకి..!
సాక్షి, అహ్మదాబాద్: కాంగ్రెస్ బహిష్కరించిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు మార్గం సుగమమైంది. పార్టీ నుంచి బహిష్కతులైన వారు.. తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏడుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9వ తేదీన బహిష్కరించిన విషయం తెలిసిందే. వారంతా గురువారం రాత్రి రాజీనామా పత్రాలను సమర్పించినట్లు అసెంబ్లీ స్పీకర్ రమణ్ లాల్ ఓరా వెల్లడించారు.
అంతేకాక వీరితో పాటు గతంలో కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆరుగురిలో ముగ్గురు త్వరలోనే బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు తమ బ్యాలెట్ పేపర్లను బీజేపీ చీఫ్ అమిత్ షా కు చూపిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ఏకంగా 14మంది పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్సన్ చేసింది. వీరిలో ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన శంకర్ సింగ్ వాఘెలా కూటమికి చెందిన మహేంద్ర వాఘెలా, రాఘవ్‌జీ పటేల్, అమిత్ చౌదరీ, బోలాబాయ్ గోహిల్, సీకే రౌల్జీ, కామ్సీ మక్వానా, హకుబా జడేజా ఉన్నారు.
కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య ప్రతిష్టాత్మకంగా, ప్రత్యక్ష యుద్దంగా జరిగింది. ఈ ఎన్నికల్లో అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు సునాయాసంగా గెలుపొందారు. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ 44 ఓట్లు సాధించి ఐదోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.