
రాంచి: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న అలంగీర్ ఆలం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలంగీర్ ఆలం మంత్రి పదవికి, కాంగ్రెస్ పక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు ఆయన కుమారుడు తన్వీర్ ఆలం వెల్లడించారు. జూన్ 8 (శనివారం) ఆయన రాజీనామా చేసి.. రిజైన్ లెటర్‌ను అదే రోజు సీఎం కార్యాలయానికి పంపించారు. అయితే ఆయన రాజీనామా లేఖ జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఆఫీసుకు సోమవారం చేరినట్లు తన్వీర్ తెలిపారు.
అలంగీర్ ఆలం రాజీనామా చేసినట్లు జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ నిర్ధారించారు. మనీలాండరింగ్ కేసులో అలంగీర్‌ను దర్యాప్తు చేయటం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే15న అరెస్ట్ చేసింది. మే 6 అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలం ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సుమారు రూ. 37 కోట్ల భారీ నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. భారీగా నగదు పట్టుబడటం జార్ఖండ్‌లో సంచలనం రేపింది. అలంగీర్ ఆలంతోపాటు సంజీవ్ లాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.
జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈడీ జహంగీర్ ఆలం ఇంటిపై సోదాలు చేసింది. వీరేంద్ర కె రామ్ గతేడాది అరెస్ట్ అయ్యారు. రూరల్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన పలు స్కీముల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment