మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా | KTR Challenge To Congress and BJP Leaders | Sakshi
Sakshi News home page

మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా

Published Sun, May 26 2024 6:23 AM | Last Updated on Sun, May 26 2024 6:23 AM

KTR Challenge To Congress and BJP Leaders

దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు రుజువు చేయండి  

కాంగ్రెస్, బీజేపీ నేతలకు కేటీఆర్‌ సవాల్‌ 

సోషల్‌ మీడియాతో యువత మెదళ్లలో అబద్ధాలు నింపారు  

ఉద్యోగాలిచ్చినా చెప్పుకోలేక పోవడం తమ వైఫల్యమేనని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగంలో గత పదేళ్లలో 2.36 లక్షల ఉద్యోగాలు తెలంగాణ మినహా దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ రుజువు చేస్తే తెల్లారే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ చేశారు. తమ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 26.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదికి వేయి చొప్పున కేవలం 10 వేల పోస్టులు భర్తీ చేసిందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కంటే 19 రెట్లు ఉద్యోగాలిచి్చనా ప్రజలకు చెప్పుకోలేకపోవడం తనతో సహా తమ పార్టీ నేతల వైఫల్యం అని చెప్పారు. కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సోషల్‌ మీడియా ద్వారా తెలంగాణ యువత మెదడు నిండా అబద్ధాలను నింపి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 వేల ఉద్యోగాలు ఇచి్చనట్లు ఊదరగొడుతూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతోంది. ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్‌ అయినా ఇచ్చిందా? సీఎం స్థాయిలో రేవంత్‌ ప్రజలకు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు చూస్తే బాధ అనిపిస్తోంది’అని కేటీఆర్‌ అన్నారు. 

95 శాతం రిజర్వేషన్ల ఘనత కేసీఆర్‌దే.. 
‘రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, నాన్‌ లోకల్‌ కేటగిరీ పేరిట నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జోనల్‌ విధానంతో అటెండర్‌ నుంచి గ్రూప్‌–1 దాకా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్‌దే. పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చాం. అందులో 2.02 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1.60 లక్షల పోస్టులు భర్తీ చేశాం. మరో 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి.

విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ఇది అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన 32,517 ఉద్యోగాలను రేవంత్‌ దుర్మార్గంగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గ్రూప్‌–1, డీఎస్సీ నోటిఫికేషన్లు రద్దు చేసి పోస్టులు పెంచకుండానే కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చారు. సీఎం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌కు అతీగతి లేదు. నిరుద్యోగ భృతి అంటూ ప్రియాంక గాంధీ నోట కూడా అబద్ధాలు చెప్పించారు’అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ‘బ్రూ’ట్యాక్స్‌ మొదలైంది 
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. భట్టి, రేవంత్, ఉత్తమ్‌ ఎవరి దుకాణం వాళ్లదే అన్నట్లు మొత్తంగా ‘బ్రూ (బీఆర్‌యూ)’ట్యాక్స్‌ మొదలైంది. బిల్డర్ల పైనా కూడా ట్యాక్స్‌ వేస్తూ దోచుకుంటున్నారు. త్వరలో జూపల్లి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్‌ చేస్తాడు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు సామంత రాజులు ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి మూర్ఖుడు, జోకర్‌లా తయారయ్యాడు. ప్రైవేటు సెక్టార్‌లో కష్టపడి తెచ్చిన పరిశ్రమలకు కూడా రేవంత్‌ పాతర వేస్తున్నారు.

5 లక్షల ఉద్యోగాలు వచ్చే ఫార్మాసిటీని రద్దు చేసి రియల్‌ ఎస్టేట్‌ చేస్తారట. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో 15 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకు వచి్చన కేన్స్‌ టెక్నాలజీ వెళ్లిపోయింది. రూ.వేయి కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపిన కేన్స్‌ గుజరాత్‌కు వెళ్లింది. వరంగల్‌ నుంచి టెక్‌ మహీంద్రా అనే సంస్థ వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది’అని కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు.  

కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడే పార్టీ బీఆర్‌ఎస్‌ 
సాక్షి, హైదరాబాద్‌: కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ బీఆర్‌ఎస్‌ అని, మీరంతా కేసీఆర్‌ కుటుంబంలో సభ్యులేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన 200 మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబ సభ్యులకు శనివారం తెలంగాణ భవన్‌లో ఇన్సూరెన్స్‌ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కార్యకర్తలకు ఇన్సూరెన్స్‌ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్‌ మదిలో నుంచి పుట్టిందని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుంటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా మొత్తాన్ని అందిస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు 5,522 మందికి రూ.118 కోట్లకుపైగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల బీమా కోసం వెచి్చంచామన్నారు. అధికారంలో లేనంత మాత్రన పార్టీ చేసే కార్యక్రమాలేవీ ఆగవని, భవిష్యత్‌లో కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని కేటీఆర్‌ సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement